Stri Shakti Scheme: బస్టాండ్లు కిటకిట
ABN , Publish Date - Aug 18 , 2025 | 05:01 AM
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి విశేష స్పందన లభిస్తోంది. వారాంతపు సెలవులు ముగియడంతో ఆదివారం బస్టాండ్లన్నీ కిటకిటలాడాయి.
‘ఉచిత బస్సు’కు పోటెత్తిన మహిళలు
విజయవాడ/రాజమహేంద్రవరం, ఏలూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి విశేష స్పందన లభిస్తోంది. వారాంతపు సెలవులు ముగియడంతో ఆదివారం బస్టాండ్లన్నీ కిటకిటలాడాయి. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో బస్సులు ఎక్కడానికి మహిళలు పోటెత్తారు. ఆదివారం ఒక్కరోజే విజయవాడ సిటీ బస్సుల్లో 80శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఉదయం నుంచి రాత్రి వరకూ రద్దీగానే ఉంది. ఇక్కడినుంచి సాధారణంగా రోజుకు 32వేల మంది మహిళలు ప్రయాణిస్తారని అంచనా. అయితే ఆదివారం దాదాపు 50వేల మంది వరకూ మహిళలు ప్రయాణం చేసినట్టు జిల్లా ఆర్టీసీ అధికారి ఏలూరి సత్యనారాయణమూర్తి తెలిపారు.
విలీన మండలాలకూ ‘స్త్రీ శక్తి’ వర్తింపు
విలీన మండలాలు, గ్రామాల ప్రయాణిలకు స్ర్తీ శక్తి పథకం వర్తింపజేస్తున్నట్టు ఏలూరు డీపీటీవో షేక్ షబ్నం తెలిపారు. ‘వీరికి ఉచితం లేదట’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ప్రచురితమై కథనానికి ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారులు స్పందించారు. రాజమండ్రి, రేపాకగొమ్ము నుంచి తెలంగాణలోని భద్రాచలం వెళ్లే సర్వీసులను ఎటపాక వరకు పొడిగించామని షేక్ షబ్నం పేర్కొన్నారు. ఈ సర్వీసులను పొడిగిస్తూ ఎన్‌క్లేవ్(ఏపీలో ప్రారంభమై మధ్యలో తెలంగాణ వచ్చి మళ్లీ ఆంధ్రా రూట్ రావడం) రూట్‌గా మార్చడం ద్వారా ఈ మార్గంలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు గ్రామాల ప్రజలను స్ర్తీ శక్తి పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. అంతరాష్ట్ర సర్వీసైన అశ్వారావుపేట షటిల్ సర్వీసును జీరో టికెట్‌గా మార్పు చేశామన్నారు. ఈ మార్గంలోని ఏపీ గ్రామాల ప్రయాణిలు స్త్రీ శక్తి పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు.