Visakhapatnam: ప్లాట్‌ఫారంపైకి దూసుకువెళ్లిన బస్సు
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:58 AM
విశాఖపట్నం ద్వారకా బస్ కాంప్లెక్స్‌లో సోమవారం సాయంత్రం ఓ బస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్‌ఫారంపైకి దూసుకువెళ్లి ఒక మహిళను ఢీకొట్టింది.
విశాఖ ద్వారకా బస్ కాంప్లెక్స్‌లో మహిళ మృతి, మరొకరికి గాయాలు
విశాఖపట్నం (మహారాణిపేట), ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ద్వారకా బస్ కాంప్లెక్స్‌లో సోమవారం సాయంత్రం ఓ బస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్‌ఫారంపైకి దూసుకువెళ్లి ఒక మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరికి స్వల్ప గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. టూటౌన్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. శ్రీకాకుళం నుంచి ఆర్టీసీ అద్దె బస్సు ద్వారకా బస్‌స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులను దింపిన తర్వాత డ్రైవర్ చంద్రరావు బస్సును శ్రీకాకుళం ప్లాట్‌ఫారంపై పెట్టేందుకు సిద్ధమయ్యాడు. అయితే బస్సు అపరిమిత వేగంతో 25 నంబర్ ప్లాట్‌ఫారంపై నుంచి ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతంలోకి దూసుకుపోయి పిల్లర్ వద్ద వెనక్కి తిరిగి నిలబడి ఉన్న విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన గేదెల ముత్యాలమ్మ(45) అనే మహిళను ఢీకొంది. బస్సుకు, పిల్లర్‌కు మధ్య నలిగిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనలో కోరాపుట్‌కు చెందిన రంజాన్ వల్లీ (22)కి స్వల్పగాయాలయ్యాయి. వైద్యం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.