Private Bus Owners: బస్సు మంటల కేసులు..తుఫాను ఖాతాలో..
ABN , Publish Date - Oct 30 , 2025 | 05:05 AM
ప్రయాణికుల భద్రత గురించి పట్టించుకోరు. బస్సులో సీట్ల స్థానంలోనూ, అత్యవసర ద్వారాలకు అడ్డంగా బెర్తులు ఏర్పాటు చేసి ఆదాయార్జనే లక్ష్యంగా వ్యవహరిస్తారు. రవాణా శాఖకు సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతారు.
సీజ్ చేసిన ట్రావెల్ బస్సులను వదిలేయండి
రవాణా అధికారులపై ప్రైవేట్ ఆపరేటర్ల ఒత్తిళ్లు
ఎంతోకొంత జరిమానాతో సరిపెట్టాలని పైరవీలు
తుఫానులో ఎవరు పట్టించుకుంటారని వ్యాఖ్యలు
కర్నూలు బస్సు ప్రమాదంతో పలు బస్సులు సీజ్
వాటిని విడిపించుకోవడానికి యజమానుల పాట్లు
అధికారుల ఆదేశాలు.. ఆపరేటర్ల ఒత్తిళ్లతో డీటీసీలు సతమతం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రయాణికుల భద్రత గురించి పట్టించుకోరు. బస్సులో సీట్ల స్థానంలోనూ, అత్యవసర ద్వారాలకు అడ్డంగా బెర్తులు ఏర్పాటు చేసి ఆదాయార్జనే లక్ష్యంగా వ్యవహరిస్తారు. రవాణా శాఖకు సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతారు. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఇంతచేస్తున్నా చూసీ చూడనట్లు వదిలేసే రవాణా శాఖ అధికారులు ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మాత్రం హడావుడి మొదలుపెడతారు. ఇటీవల కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ అధికారులు.. వందలాది బస్సులపై కేసులు పెట్టి, సీజ్ చేస్తున్నారు. దీంతో బెంబేలెత్తిన ప్రైవేటు ఆపరేటర్లు బేరసారాలకు దిగుతున్నారు. ‘తూతూమంత్రంగా ఫైన్లు వేసి తుఫాను చాటున మా బస్సుల్ని వదిలేయండి’ అంటూ డీటీసీలు, ఆర్టీవోలపై ఒత్తిడి తెస్తున్నారు. పదో, పరకో జరిమానా వేసి వదిలేస్తే మళ్లీ బస్సులు రోడ్డెక్కిస్తామని చెబుతున్నారు. కాదని మొండిగా వ్యవహరిస్తే డ్రైవర్లకు ఉపాధి పోతుందని, తమకు ఈఎంఐలు చెల్లించడం ఇబ్బంది అవుతుందని కష్టాలు ఏకరువు పెడుతున్నారు. అప్పటికీ కుదరకపోతే అధికారంలో ఉన్న పెద్దలతో ఫోన్లు చేయిస్తున్నారు.
అనుమతి లేకుండానే మార్పులు
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 3,500 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో ఏపీ, తెలంగాణల్లో రిజిస్ట్రేషన్లు అయినవి చాలా తక్కువ. అలిండియా పర్మిట్ ఉన్న వాటిలో నాగాలండ్, అరుణాచల్‌ప్రదేశ్, డయ్యూ డామన్‌లలో రిజిస్టర్ చేయించినవే ఎక్కువగా ఉన్నాయి. ఆ బస్సుల యజమానులు వాటిని తిరిగి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ లాంటి పన్ను తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో రీ-రిజిస్ట్రేషన్ చేయించారు. మొదటి రిజిస్ట్రేషన్ సమయంలో సీట్లతో ఉన్న బస్సులను ఎలాంటి అనుమతి తీసుకోకుండా బెర్తులుగా మార్పుచేసి నడుపుతున్నారని ఇటీవల చేపట్టిన తనిఖీల్లో బయటపడింది. ఆ బస్సులు రిజిస్ట్రేషన్ అయిన రాష్ట్రాల రవాణా అధికారులను ఇక్కడి ఆర్టీఏ అధికారులు సంప్రదించగా ఎలాంటి మార్పులకు అనుమతులు ఇవ్వలేదని తేలింది.
ఈ ప్రమాణాలు తప్పనిసరి
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (సీఐఆర్‌టీ), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్‌ఏఐ) వంటి సంస్థలు ఆమోదం తెలిపిన డిజైన్లతోనే బస్ బాడీ రూపొందించాలి. అత్యవసర ద్వారాలు ఎక్కడ ఉండాలి.. ప్రయాణికులు నడిచేందుకు ఎంత స్థలం వదలాలి... అగ్ని ప్రమాదాల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి.. అనే విషయాల్లో ఈ సంస్థలు సూచించిన ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలి. కొత్త బస్సులు కొనుగోలు చేసిన ఆర్టీసీలో ఇటువంటి రక్షణ ఏర్పాట్లు లేవంటూ రెండేళ్ల క్రితం రవాణా శాఖ రిజిస్ట్రేషన్లు ఆపేసింది. దీంతో ఆర్టీసీ అధికారులు తిరిగి వాటిని అమర్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కానీ ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం అవేవీ పట్టించుకోలేదు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తర్వాత ఆర్టీఏ జరుపుతున్న విస్తృత తనిఖీల్లో వందలాది ప్రైవేటు ట్రావెల్స్‌లో ఉల్లంఘనలు, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వరుస తనిఖీలు చేస్తున్న రవాణా శాఖ అధికారులు 450 బస్సులకు పైగా కేసులు రాశారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 185 బస్సుల వరకూ సీజ్ చేశారు. దీంతో వాటి యజమానులు జిల్లాల్లోని రవాణా శాఖ అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. ‘బస్సు మంటల్లో కాలిపోవడంతో మీపై ఒత్తిడి ఉంటుంది.. ఇప్పుడు తుఫాను హడావుడిలో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు.. సీజ్ చేసిన బస్సులకు ఎంతో కొంత జరిమానా విధించి వదిలేయండి’ అంటూ ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. రవాణా శాఖ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా గట్టిగా వ్యవహరిస్తుండటంతో ఇద్దరి మధ్య నలిగిపోతున్నామంటూ ఎంవీఐల నుంచి డీటీసీల వరకూ వాపోతున్నారు.