Share News

ఆరోగ్యం బాగు చేస్తామని బురిడీ..

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:43 PM

మంత్రాలయం మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన ఉప సర్పంచ వగరూరు చిట్టెమ్మ, ఆమె అత్త మరియమ్మను ఓ దొంగ స్వామిజీ ఆరోగ్యం బాగు చేస్తామని నమ్మించి బురిడి కొట్టించాడు.

   ఆరోగ్యం బాగు చేస్తామని బురిడీ..
బాదితురాలి గృహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ విజయకుమార్‌

3 తులాల బంగారు, 66 తులాల వెండి, రూ.2,500 నగదు అపహరణ

మాధవరం పోలీస్‌ స్టేషనలో కేసు నమోదు

మంత్రాలయం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన ఉప సర్పంచ వగరూరు చిట్టెమ్మ, ఆమె అత్త మరియమ్మను ఓ దొంగ స్వామిజీ ఆరోగ్యం బాగు చేస్తామని నమ్మించి బురిడి కొట్టించాడు. వారి దగ్గర ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలు, 66 తులాల వెండి, రూ.2,500 నగదు అపహరించుకుని వెళ్లాడు. బాధితులు మాధవరం పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు. 15 రోజుల కింద గ్రామ ఉప సర్పంచ వగరూరు చిట్టెమ్మ తన ఇంటి వద్ద ఉండగా.. ఓ మహిళ కమ్మలు, గాజులు అమ్ముకుంటూ వచ్చి చిట్టెమ్మను పరిచయం చేసుకుంది. తనకు తెలిసిన స్వామీజీ ఒకరు ఆరోగ్యం బాగు చేస్తారని.. ఆయన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నారని, ఆయన వివరాలు చెప్పి, ఆయన వస్తే తనకు తెలియజేయాలని కోరింది. శుక్రవారం ఉదయం మరోసారి ఆ మహిళ చిట్టెమ్మను కలిసి స్వామిజీ కనిపించాడా? అని ఆరా తీసింది. శనివారం ఉదయం చిట్టెమ్మ ఇంటి వద్ద సదరు స్వామీజీ కనపడటంతో చిట్టెమ్మ గమనించి.. నీ కోసం ఓ మహిళ వెతుకుతున్నదని చెప్పి ఇంట్లోకి ఆహ్వానించింది. చిట్టెమ్మ కుటుంబం కష్టాల్లో ఉన్నదని, పూజలు చేసి తీరుస్తానని స్వామీజీ చెప్పాడు. ఆయన మాటలు చిట్టెమ్మ నమ్మింది. మంత్రించిన బియ్యం, పసుపు, కుంకుమతో స్వామీజీ పూజలు చేశాడు. అందులో వెండి, బంగారు వస్తువులు ఉంచితే మీకు ప్రాణహానీ తప్పుతుందని నమ్మించి ఓ టిఫెన బాక్సులో వాటిని పెట్టించాడు. ఆ తర్వాత ఆ బాక్సును సాయంత్రం 5.05 గంటలకు తెరిచి చూడాలని, ఆ బంగారు వెండి వస్తువులను పాలలో కలిపి ఆ పాలను అనారోగ్యంతో ఉన్న వారందరూ తాగితే బాగవుతారని నమ్మించాడు. సాయంత్రం బాక్సు తెరిచి చూస్తే బంగారు, వెండి కనిపించలేదు. మోసపొయామని గుర్తించి పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ విజయకుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా మోసం చేసిన స్వామీజీ ఆచూకీ తెలుసుకుంటున్నామని అన్నారు. చిట్టెమ్మవి 50 తులాల వెండి కడియాలు, 16 తులాల వెండి పట్టీలు, రెండు జతలు బంగారు కమ్మలు, బుడి కడ్డీలు, ఆమె అత్త మరియమ్మవి ఒకటిన్నర తులాల పూర్నిలు, 13బంగారు గుండ్లు, కమ్మలు అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 05 , 2025 | 11:43 PM