Demonetized Notes: స్వామీ.. ఇదేం భారం
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:23 AM
దేవుడి హుండీలు కానుకలతో నిండితే మంచిదే! ఆలయ అభివృద్ధి పాటు భక్తులకు తగిన వసతి సదుపాయాలు కల్పించేందుకు అవకాశముంటుంది. కానీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల హుండీల్లో భక్తులు ఇంకా...
దేవుడి మొక్కులకు హుండీల్లో విలువలేని నోట్లు
‘ద్వారకా తిరుమల’లో పేరుకుపోతున్న రద్దయిన పాత కరెన్సీ
దాచలేక.. పడేయలేక అఽధికారుల తంటాలు
చిల్లర నాణేలతోనూ పనిలేదని పెదవి విరుపు
(ద్వారకాతిరుమల-ఆంధ్రజ్యోతి)
దేవుడి హుండీలు కానుకలతో నిండితే మంచిదే! ఆలయ అభివృద్ధి పాటు భక్తులకు తగిన వసతి సదుపాయాలు కల్పించేందుకు అవకాశముంటుంది. కానీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల హుండీల్లో భక్తులు ఇంకా ‘మొక్కు’..బడిగా పాత చెల్లని కరెన్సీని కానుకలుగా వేయడం నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. ఈ కారణంగా ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం, పెనుగంచిప్రోలు వంటి ప్రముఖ ఆలయాల్లో కోట్లాది రూపాయల మేర రద్దయిన పాత కరెన్సీ కోట్లాది రూపాయల మేర పేరుకుపోయింది. ఆయా ఆలయాల్లో హుండీలు తెరిస్తే చాలు... ఇప్పటికీ పాత రూ.500, రూ.1000ల నోట్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఈనోట్లు రద్దయి తొమ్మిదేళ్లు గడుస్తున్నా కొందరు భక్తులు ఇంకా ఆ నోట్లను ఇప్పటికీ హుండీల్లో వేస్తూనే ఉన్నారు. దీంతో ఇవి ఆలయాల స్ట్రాంగ్ రూముల్లో మూటల్లో మూలుగుతున్నాయి. విలువలేని ఈ నోట్లను భద్రంగా బీరువాల్లో భద్రపరుస్తున్నారు. ఇవి రద్దయిన రెండేళ్ల తర్వాత అంటే 2018-2019 ప్రాంతంలో దేవదాయ శాఖ ఆదేశాల మేరకు అన్ని ఆలయాల సిబ్బంది ముంబైలోని రిజర్వ్ బాంక్‌కు వెళ్లి పాతనోట్లు మార్చాలని కోరినా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు లేవని చెప్పడంతో వారు వెనుతిరిగారు. అప్పటి నుంచి అవి స్ట్రాంగ్ రూమ్‌లకే పరిమితమయ్యాయి. ఇటీవల రద్దైన రూ.2వేల నోటు కూడా ఆ జాబితాలో చేరినా, దాన్నింకా మార్చుకునే అవకాశం ఉండటం కాస్త ఊరటనిస్తోంది.
మొక్కుబడిగా..!
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని చినవెంకన్న దేవస్థానంలో 2017 జనవరి 17 నుంచి 2025 జూలై 17 నాటికి రూ.88.17 లక్షల విలువైన పాత కరెన్సీ ఉన్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఆలయ స్ట్రాంగ్ రూమ్‌లో, రద్దయిన వెయ్యి నోట్లు 2,873, రద్దయిన రూ.500 నోట్లు 11,888 ఉన్నట్లు వారు వివరించారు. రద్దయిన రూ.2000 నోట్లు కూడా ఉన్నా వాటిని మార్చుకునే అవకాశం ఇంకా ఉందని వారు ధీమా వ్యక్తం చేశారు. హుండీల ద్వారా రూ.2 వేల నోట్లు వంద వరకు వచ్చిన వెంటనే వాటిని హైదరాబాద్, రిజర్వ్ బ్యాంకులో మారుస్తున్నట్టు చెబుతున్నారు. తాజాగా, గత నెల 17న నిర్వహించిన హుండీల లెక్కింపులో సైతం 14.. 2000 నోట్లు మినహాయిస్తే, పాత రూ.500 నోట్లు 15, రూ.1000లు 12 నోట్లు వచ్చాయి. ఇంకా తమ వద్ద ఉన్న ఇలాంటి నోట్లను పాడేయడం ఇష్టం లేకే... సదరు భక్తులు విలువలేని నోట్లను మొక్కుబడుల పేరుతో హుండీల్లో వేస్తున్నట్టు తెలుస్తోంది. వీటిని ఇలా మూటలు కట్టి దాయడం తప్ప ఏమీ చేయలేమని అధికారులు పెదవి విరుస్తున్నారు. విలువలేని కరెన్సీ నోట్ల పరిస్థితి ఇలా ఉంటే... విలువ ఉన్న చిల్లర నాణేలు సైతం పలు కారణాలతో బ్యాంకుల్లో మూలుగుతున్నాయి.
బ్యాంకుల్లో మూలుగుతున్న చిల్లర మూటలు
ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల ద్వారా ప్రతి నెలా దాదాపు రూ.9 లక్షల వరకూ చిల్లర నాణేలు వస్తాయి. కోట్లాది రూపాయల మేర డిపాజిట్‌లు ఉంటాయికాబట్టి నోట్లతో పాటు ఆ చిల్లర నాణేలను సైతం యూనియన్ బ్యాంకు అధికారులు తప్పనిసరిగా తమతో తీసుకుని వెళ్తున్నారు. ప్రస్తుతం స్థానిక యూనియన్ బ్యాంకులో రూ.35 లక్షల వరకూ చిల్లర నాణేలు మూటల్లో మూలుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. గతంలో వ్యాపారులు ఆలయ హుండీలు తెరిచే సమయంలో ఆ నాణేల కోసం పడిగాపులు కాసేవారు. అయితే ఇప్పుడా పరిస్థితులు లేవు. యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి రావడంతో ప్రత్యక్ష నగదు చెల్లింపులు కొంతవరకు ఆగిపోయాయి. దీంతో బ్యాంకుల్లో చిల్లర మూటలు పేరుకుపోతున్నాయి.