South Central Railway: ఏపీ మీదుగా బుల్లెట్ రైలు
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:55 AM
చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు తిరుపతి మార్గంలో నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేసిన దక్షిణ మధ్య రైల్వే...
చెన్నై - హైదరాబాద్ వయా తిరుపతి
ప్రయాణ సమయం 2.20 గంటలు తగ్గే చాన్స్
తమిళనాడుకు ప్రతిపాదనలు అందజేసిన దక్షిణ మధ్య రైల్వే
చెన్నై, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు తిరుపతి మార్గంలో నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేసిన దక్షిణ మధ్య రైల్వే... ఆ మేరకు నివేదికను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. 2027లో సూరత్ నుంచి తొలి బుల్లెట్ రైలు నడిచేలా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా దక్షిణాదిన రెండు మార్గాల్లో బుల్లెట్ రైళ్ల ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది. చెన్నై-బెంగళూరు-మైసూరు మార్గంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు అమలుకు భూసర్వే జరుగుతోంది. అలాగే చెన్నై-హైదరాబాద్ మధ్య 778 కి.మీ. బుల్లెట్ రైలు ప్రాజెక్టు నివేదికను దక్షిణ మధ్య రైల్వే సిద్ధం చేస్తోంది. చెన్నై నుంచి గూడూరు మీదుగా హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు సేవలు అందేలా చర్యలు చేపట్టాలని భావించింది. అయితే తిరుపతి మార్గంలో ఆ ప్రాజెక్టును అమలు చేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే దక్షిణ మధ్య రైల్వేకు విజ్ఞప్తి చేసింది. ఆ ప్రకారం కొన్ని సవరణలు చేసి నివేదిక రూపొందించిన దక్షిణ మధ్య రైల్వే... ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. దీనికి సూత్రప్రాయంగా ఆమోదం లభిస్తే, చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించిన భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం, తమిళనాడు ప్రభుత్వ కన్సల్టెన్సీ రిట్జ్, తమిళనాడులో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ‘223.44 హెక్టార్ల భూమి అవసరం. చెన్నై సెంట్రల్, మీంజూరు సమీపంలోని చెన్నై ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో 2 బుల్లెట్ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’ అని నివేదిక సమర్పించినట్లు సమాచారం. బుల్లెట్ రైలు ప్రాజెక్టు అమలులోకి వస్తే... ప్రస్తుత ప్రయాణ సమయం 12 గంటలు కాగా... 2.20 గంటలు తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.