క్యాబినెట్ ఆమోదం లేకుండానే అప్పులు: బుగ్గన
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:30 AM
మంత్రివర్గం ఆమోదం లేకుండానే ఏపీలోని కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని మాజీ మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు.
పంజాగుట్ట, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): మంత్రివర్గం ఆమోదం లేకుండానే ఏపీలోని కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని మాజీ మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బేవరేజేస్ కార్పొరేషన్ బాండ్లు తాకట్టుపెట్టి.. 9శాతానికిపైగా వడ్డీతో రూ.5,750 కోట్లు అప్పు తెచ్చిందన్నారు. ఇవే బాండ్లను తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమం కోసం అమ్మకానికి పెడితే నానా రాద్ధాంతం చేశారని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు తెస్తున్నా జీవో ఇవ్వడం లేదని అన్నారు. ఎక్సైజ్ శాఖ జీవో ఇవ్వలేదని.. క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా బాండ్లకు ప్రభుత్వం ఎలా గ్యారెంటీ ఇస్తుందని ప్రశ్నించారు. అప్పుల విషయంలో కూటమి నేతలు యాక్టర్ల కంటే ఎక్కువ నటిస్తున్నారని, అమరావతి కోసం రూ.40 వేల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు.