Buddha Venkanna: దొంగ ప్రమాణాల వల్లే కటకటాల్లోకి జోగి
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:12 AM
మాజీ మంత్రి జోగి రమేశ్ మంచివాడంటూ పెద్దదొంగ అయిన వైసీపీ అధినేత జగన్ సర్టిఫికెట్ ఇవ్వటం హాస్యాస్పదమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.
త్వరలో జగన్ పేరూ బయటికి: బుద్దా వెంకన్న
విజయవాడ(వన్‌టౌన్), నవంబరు 2(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి జోగి రమేశ్ మంచివాడంటూ పెద్దదొంగ అయిన వైసీపీ అధినేత జగన్ సర్టిఫికెట్ ఇవ్వటం హాస్యాస్పదమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. విజయవాడలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆదివారం బుద్దా వెంకన్న విలేకరులతో మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ జైలుకెళ్లటం ఎప్పుడో ఖాయమైందని చెప్పారు. దుర్గమ్మ ఆలయానికి వెళ్లి దొంగ ప్రమాణం చేశాడని, అందుకే అమ్మవారు వెంటనే ప్రభావం చూపారని తెలిపారు. తాను బీసీనని జోగి చెప్పుకోడానికి సిగ్గు ఉండాలన్నారు. దోచుకున్న డబ్బును బీసీలకు పంచిపెడతాడా? అని ప్రశ్నించారు. ఎన్నో రంకెలు వేసిన జోగి రమేశ్.. పోలీసులు ఇంటికి వెళ్లగానే బాత్‌రూమ్‌లో ఎందుకు దాక్కున్నాడని ప్రశ్నించారు. నకిలీ మద్యం కేసులో జగన్ కూడా ఉన్నారని, విచారణలో జగన్ పేరును జోగి రమేశ్ వెల్లడించనున్నారని పేర్కొన్నారు. జగన్ పెద్ద దొంగ అయితే, జోగి రమేశ్ అండ్ కో చిన్న దొంగలన్నారు. అతి చేస్తే కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబ సభ్యులతో తాడేపల్లి ప్యాలెస్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆన్‌లైన్ లావాదేవీలు లేకుండా మద్యం షాపుల్లో రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.