Share News

లంచావతారం!

ABN , Publish Date - Jul 28 , 2025 | 01:14 AM

పొరుగున ఉన్న జిల్లా నుంచి గత ఏడాది ఆగస్టు నెలలో ఎస్‌ఐ స్థాయి అధికారి జిల్లాకు వచ్చారు. గుడివాడ, మచిలీపట్నం మధ్యన ఒక పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నారు. ఇక్కడకు వచ్చి బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల పాటు సక్రమంగానే పనిచేశారు. ఆ తర్వాత నుంచి ఆయనలో ఉన్న అవినీతి కోణాన్ని వెలికితీసి తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. స్టేషన్‌కు వచ్చిన బాధితులు, నిందితులు అనే తేడాలేకుండా తన అనుభవమంతా ఉపయోగించి ముక్కుపిండి ముడుపులు వసూలు చేస్తున్నారు. దీంతో స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

లంచావతారం!

- గుడివాడ డివిజన్‌లోని ఓ ఎస్‌ఐ తీరుతో జనం బెంబేలు

- బాధితులు, నిందితుల నుంచి ముడుపులు వసూలు

- స్థానిక వ్యాపారులతో నగదు లావాదేవీలు

- ఇక్కడి విషయాలు పైఅధికారులకు చేరవేస్తున్నారని సిబ్బందితో గొడవ

- పోలీస్‌ స్టేషన్‌కు రావాలంటే భయపడుతున్న ప్రజలు

పొరుగున ఉన్న జిల్లా నుంచి గత ఏడాది ఆగస్టు నెలలో ఎస్‌ఐ స్థాయి అధికారి జిల్లాకు వచ్చారు. గుడివాడ, మచిలీపట్నం మధ్యన ఒక పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నారు. ఇక్కడకు వచ్చి బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల పాటు సక్రమంగానే పనిచేశారు. ఆ తర్వాత నుంచి ఆయనలో ఉన్న అవినీతి కోణాన్ని వెలికితీసి తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. స్టేషన్‌కు వచ్చిన బాధితులు, నిందితులు అనే తేడాలేకుండా తన అనుభవమంతా ఉపయోగించి ముక్కుపిండి ముడుపులు వసూలు చేస్తున్నారు. దీంతో స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ అయిన సదరు అధికారి స్టేషన్‌కు వచ్చే బాధితులు, నిందితులతో బేరాలకు దిగుతున్నట్టు సమాచారం. ఇంత మొత్తంలో ఇస్తే కేసులు నమోదు చేస్తానని బాధితులతో, ఇంతమొత్తం ఇస్తే తక్కువ శిక్షలు పడేలా సెక్షన్లు వేస్తానని నిందితులతో బేరాలు మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. తన స్టేషన్‌ పరిధిలో ఉన్న వ్యాపారస్తులతో పరిచయాలు పెంచుకుని, వారిని స్టేషన్‌కు పిలిపించి, మీతో స్నేహంగా ఉంటానని, మీ అకౌంట్‌లో తాను చెప్పిన మనుషులు నగదు వేస్తారని, వాటిని ఏ రోజుకారోజు డ్రాచేసి తనకు నగదు రూపంలో ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ఇప్పటికే ముగ్గురు వ్యాపారులను ఈ తరహాలో వాడుకుంటున్నట్టు తెలిసింది. కొందరు వ్యాపారులు ఈ ప్రతిపాదనను విని తాము ఈ పనిచేయలేమని చెప్పి వచ్చేసినట్టు సమాచారం. ఇలాంటి ఎస్‌ఐను ఎక్కడా చూడలేదని వారు చెప్పుకోవడం గమనార్హం. స్టేషన్‌లో పనిచేసే ఒకరిద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును తన చెప్పుచేతల్లో పెట్టుకున్న సదరు ఎస్‌ఐ తన అవినీతి వ్యవ హారాలను చక్కబెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

స్టేషన్‌ సిబ్బందిని బెదిరించి..

ఈ ఎస్‌ఐ చేస్తున్న అక్రమాలు, అవినీతి వ్యవహారాలను పైఅధికారులకు చేరవేస్తున్నారనే కారణంతో ఇటీవల స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందితో ఈ ఎస్‌ఐ గొడవకు దిగి బెదిరించినట్టు తెలిసింది. తాను తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చానని, తనను ఎవ్వరూ ఏం చేయలేరని, మహా అయితే సస్పెండ్‌ అవుతానని, ఇది తనకేమీ కొత్త కాదని తనదైన శైలిలో స్టేషన్‌లోనే కేకలు వేయడం చర్చనీయాంశంగా మారింది.

రౌడీ షీటర్ల నుంచి మామూళ్లు

స్టేషన్‌ పరిధిలో ఉన్న రౌడీషీటర్లను అదుపు చేసి, వారి కదలికలపై నిఘా ఉంచాల్సిన ఈ అధికారి వారి నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారని స్టేషన్‌ సిబ్బందే చెప్పుకుంటున్నారు. తాను అడిగినంత ఇవ్వకపోతే గంజాయి విక్రయిస్తున్నట్లుగా మీపై కేసులు నమోదు చేస్తానని బెదిరించడం గమనార్హం. ఈ స్టేషన్‌ పరిధిలో వారంలో ఒకరోజు జరిగే వ్యాపార నిమిత్తం వచ్చే వాహనాల సామర్థ్యాన్ని బట్టి, ఒక్కో వాహనం నుంచి రూ.3వేల నుంచి రూ.10 వేల వరకు నగదు వసూలు చేస్తుండటంతో స్థానిక వ్యాపారులు, వాహన యజమానులు ఈ ఎస్‌ఐ పేరు చెబితేనే వణికిపోతున్నారు. ఇటీవల కాలంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని కాకుండా, వేరే వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. సీసీ కెమెరాల పుటేజీలను సేకరించిన వాహన యజమాని ప్రమాదానికి కారణం తన వాహనం కాదని సాక్ష్యాలు చూపినా, వినకుండా పెద్దమొత్తంలో అతని నుంచి నగదు వసూలు చేసి వాహనాన్ని విడిచిపెట్టడం, ఈ విషయం బయటకు పొక్కడంతో ఈ ఎస్‌ఐ పనితీరుపై స్థానికులు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. స్టేషన్‌ పరిధిలో 25కుపైగా పంచాయతీలు ఉండగా, ఒక్కో పంచాయతీలో ఇద్దరేసి చొప్పున ఏజెంట్లుగా నియమించుకుని ఆయా గ్రామాల నుంచి ఏమైౖనా ఫిర్యాదులు వస్తే, తన ఏజెంట్ల ద్వారా తెరవెనుక బేరసారాలు నడిపి బాధితులు, నిందితుల నుంచి పెద్దమొత్తంలో నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇటీవల ఈ మండలానికి చెందిన కొందరు బాధితులు ఈ ఎస్‌ఐ తీరుపై నేరుగా ఉన్నతాధికారి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయినా ఈ ఎస్‌ఐ పనితీరులో మార్పు రాకపోగా, మరింతగా తన వసూళ్లను వేగవంతం చేశారని ఉన్నతాధికారులు ఈ అధికారి తీరుపై విచారణ చేసి కొంత మేర అయినా అదుపు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 28 , 2025 | 01:14 AM