Political Corruption: ఎవరా వైసీపీ మంత్రి కొడుకు
ABN , Publish Date - Aug 18 , 2025 | 03:45 AM
జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వివాదంపై ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన అంశాలకు ప్రతిస్పందనగా నెల్లూరుకు చెందిన నిడిగుంట అరుణ వెల్లడించిన విషయాలు కలకలం సృష్టిస్తున్నాయి.
శ్రీకాంత్ రెమిషన్ కోసం 11 లక్షలు లంచం
బాంబు పేల్చిన నెల్లూరు మహిళ అరుణ
గత ప్రభుత్వంలో బేరసారాలు
పెరోల్ కోసం కొందరు అధికారులు చిత్రహింసలు పెట్టారని వెల్లడి
కలకలం సృష్టిస్తున్న పెరోల్ ఎపిసోడ్
వైద్యం పేరిట శ్రీకాంత్ తరచూ నెల్లూరు జైలు నుంచి తిరుపతికి
ఇద్దరూ కలసి రుయాలో సెటిల్మెంట్లు
అరుణ సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్
ప్రమాదంలో చేతికి గాయం ‘కట్టు’కథే?
ప్రత్యర్థితో ఘర్షణలోనే శ్రీకాంత్‌కు గాయం
బయటికొస్తున్న బాధితులు, ఆధారాలు
నెల్లూరు సెంట్రల్ జైలులో యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న అవిలేలి శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్‌లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. శ్రీకాంత్ తన భర్తేనని, ఆయన పెరోల్ కోసం పడరాని పాట్లు పడ్డానని, రెమిషన్ కోసం వైసీపీకి చెందిన అప్పటి మంత్రి కుమారుడికి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చానని, ఈ ప్రయత్నాల్లో కొందరు అధికారులు తనను చిత్రహింసలకు గురిచేశారని నెల్లూరుకు చెందిన నిడిగుంట అరుణ బాంబు పేల్చింది. 11 లక్షలు డబ్బులు ఇచ్చానని అరుణ చెబుతున్న ఆ మంత్రి కొడుకు ఎవరు? ఆమెను చిత్రహింసలకు గురి చేసిన అధికారు లెవరు? ఆమెను అందరూ వేధిస్తే శ్రీకాంత్‌కు పెరోల్ ఎలా వచ్చింది? చివరికి పెరోల్ రావడానికి సహకరించిన అధికారులెవరు? సమగ్రంగా విచారిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలతో పాటు మరెన్నో విషయాలు బయటికొస్తాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వివాదంపై ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చిన అంశాలకు ప్రతిస్పందనగా నెల్లూరుకు చెందిన నిడిగుంట అరుణ వెల్లడించిన విషయాలు కలకలం సృష్టిస్తున్నాయి. శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్, అరుణకున్న పరిచయాలు, సెటిల్మెంట్ల వ్యవహారాలపై ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, పోలీసు వర్గాలు కూపీ లాగుతున్నాయి. వరుసగా బయటికి వస్తున్న బాధితులు తమ గోడు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన అత్యంత సాధారణ మహిళ అయిన అరుణ ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి చేరడం వెనుక ఎన్నో అరాచకాలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
గత ఎన్నికల్లో సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో ‘దిశ’ యాప్ ప్రచారకర్తగా అరుణ తనకు తాను ప్రకటించుకుంది. 2022లో ఒక ఎన్‌జీవోగా జైలులో ఖైదీలతో ముచ్చటించేందుకు వెళ్లిన అరుణ మొదటి చూపులోనే శ్రీకాంత్ ప్రేమలో పడినట్లు చెబుతోంది. గత ప్రభుత్వంలో అరాచకశక్తులకు రాష్ట్రంలో పూర్తిగా మద్దతు ఉండేది. అదే అవకాశంగా తీసుకున్న అరుణ జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్‌ను ప్రేమించడం వెనుక కూడా భారీ ఎత్తుగడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల మద్దతున్న శ్రీకాంత్ వందల మంది యువకులతో గ్యాంగ్‌లు ఏర్పాటు చేసుకున్నాడు. దందాల నుంచి హత్యల వరకూ ఈ గ్యాంగ్ సభ్యులు వెనుకాడబోరని నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్పీల నివేదికలు చెబుతున్నాయి. శనివారం నాడు ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ప్రచురితమైన ‘ఖాకీనే వణికించే కిలేడి’ కథనంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీసు ్తన్న కొద్దీ అరుణ బాగోతాలు బయటకు వస్తున్నాయి. బాధితులు బయటకు వచ్చి గతంలో జరిగిన అరాచకాలను చెబుతున్నారు. ఆమెను చట్టపరంగా శిక్షించాలని వేడుకొంటున్నారు. యువకులతో బెదిరించి ఆమె చేసిన దందాలతో పాటు ప్రేమ పెళ్లిళ్లు సైతం ఉన్నాయని, లక్షలాది రూపాయలు వసూలు చేసిందని పోలీసులు ఆధారాలు సేకరించారు. అరుణకు ఎవరెవరితో ఎటువంటి పరిచయాలు ఉన్నాయి? అనే దిశగా కూపీ లాగుతున్న కొద్దీ కొత్త కొత్త లింకులు బయట పడుతున్నాయి.
తిరుపతి ఆస్పత్రిలో ఏమి జరిగింది?
నెల్లూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ చేతి గాయం వెనుక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరగడం కల్పితమని, ఆస్పత్రిలో సెటిల్మెంట్ వివాదం సందర్భంగా జరిగిన దాడిలో పడిన కత్తి వేటుగా తెలుస్తోంది. తాజాగా పోలీసులకు లభించిన వీడియోల్లో.. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో శ్రీకాంత్ ఎడమ చేతికి కట్టు కట్టుకుని బెడ్‌పై ఉండగా, ఎదురుగా నిడిగుంట అరుణ కూర్చొని తన మెడ చుట్టూ ఏదో క్రీమ్ రాయించుకుంటూ ఉంది. ఆ వీడియోలో శ్రీకాంత్ చేతికి కట్టు చూసిన పోలీసులు.. అంతకుముందే లభించిన సమాచారం ఆధారంగా దాని గురించి ఆరా తీశారు. గత ఏడాది డిసెంబరు 17న నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి వైద్యం కోసం శ్రీకాంత్‌ను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రోడ్డుకు అడ్డంగా బైకు రావడంతో ప్రమాదం జరిగిందని, శ్రీకాంత్ చేతికి గాయమైందని రక్షణగా వెళ్లిన సాయుధ పోలీసులు చెప్పారు. అయితే నెల్లూరు జైలులో డాక్టర్ పరిశీలించి అది ప్రమాదంలో ఏర్పడిన గాయం కాదని, కత్తి లేదా పదునైన ఆయుధంతో నరికినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో జైలు సూపరిండెంట్ ప్రమాదానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ అడిగితే.. కేసు పెట్టలేదని ఏఆర్ పోలీసులు చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వంలోని పెద్ద బ్యూరోక్రాట్ నుంచి ఒత్తిడి రావడంతో చేతి కట్టు గాయం వ్యవహారంలో ముందుకు వెళ్లకుండా ఆగిపోయారని తెలిసింది. వాస్తవానికి ఆస్పత్రిలో సెటిల్మెంట్ సందర్భంగా జరిగిన గొడవలో శ్రీకాంత్ ఒక వ్యక్తిపై దాడి చేయగా, ప్రత్యర్థి కత్తితో వేసిన దెబ్బ తప్పించుకోవడానికి అతను చేయి అడ్డు పెట్టినప్పుడు గాయమైందని దాదాపు రుజువైనట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదానికి గురైన కారు కూడా ప్రైవేటు వాహనంగా తేలింది. ఆ రోజు ఎవరెవరికి గొడవ జరిగింది? అంతకు ముందు శ్రీకాంత్ వెళ్లిన ప్రతిసారీ ఎవరెవరు ఆస్పత్రికి వచ్చారు? జైలు బయటికి వచ్చినప్పుడు అరుణ నంబర్‌తో ఎవరెవరికి ఫోన్లు వెళ్లాయి? వారిలో బాధితులు ఎవరు? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో సుమారు 30 మంది వరకూ ప్రశ్నించినట్లు తెలిసింది. అనారోగ్యం పేరుతో ఆస్పత్రికి వచ్చి బెదిరింపులకు దిగుతున్న శ్రీకాంత్‌ను మరో జైలుకు తరలించి, అరుణ దందాలపై పక్కా ఆధారాలు సేకరించి చట్టపరంగా చర్యలకు ఉపక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అరుణ సామాన్యురాలట..!
పోలీసుల విచారణలో బాధితుల కన్నీళ్లు, అరుణ అరాచకాలు వెలుగులోకి వస్తుండగా.. అరుణ మాత్రం తానే బాధితురాలినని, ఎంతగానో ఇబ్బంది పడ్డానని చెబుతోంది. రాజకీయ నాయకులు డబ్బులు మోసం చేస్తే, పోలీసులు తనను తీవ్రంగా హింసించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒక ఎస్‌ఐ తనకు తడలో పోస్టింగ్ ఇప్పించాలని బెదిరించారని, లేకపోతే శ్రీకాంత్‌పై మరిన్ని కేసులు పెడతానంటూ తనను చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపిస్తోంది. ఇక్కడే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక సాధారణ మహిళగా చెప్పుకొంటున్న అరుణ దగ్గరికి ఎస్‌ఐ వచ్చి పోస్టింగ్ ఇప్పించమని అడిగారంటే ఆమె స్థాయి ఏ పాటితో అర్థం అవుతుంది. అరుణ చెబుతున్నట్లు ‘దిశ’ యాప్ ప్రచారకురాలికి ఎస్‌ఐ పోస్టింగ్ ఇప్పించే స్థాయి ఆమెకు ఉంటుందా? సామాన్యురాలికి మంత్రి కుమారుడితో మాట్లాడుకుని లంచంగా పదకొండు లక్షల రూపాయలు ఇచ్చే శక్తి ఉంటుందా? నిశితంగా పరిశీలిస్తే ఆమెకు చాలా పైస్థాయిలో పెద్దవారితో సంబంధాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
రౌడీషీటర్‌కు రాచమర్యాదలు
నెల్లూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): హత్య కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో జీవితఖైదుగా ఉన్న రౌడీషీటర్ శ్రీకాంత్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శ్రీకాంత్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు నిడిగుంట అరుణ అతడితో సన్నిహితంగా మెలిగిన వీడియోలు వైరల్‌గా మారాయి. నిబంధనల ప్రకారం జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ఇతరులతో మాట్లాడే అవకాశం ఉండదు. ములాఖత్ సమయంలో మాత్రమే మాట్లాడే అవకాశం కల్పిస్తారు. ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు ఖైదీ వెంట ఎస్కార్ట్ సిబ్బంది ఉంటారు. కానీ వైరల్ అవుతున్న వీడియోల్లో శ్రీకాంత్, అరుణ చేతిలో చేయి వేసుకుని పక్కపక్కనే కూర్చుని మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ తతంగం మొత్తాన్ని వారే వీడియో తీయించుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఇంత ధైర్యంగా నిబంధనలు అతిక్రమిస్తుంటే జైలు అధికారులు, పోలీసు అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ వీడియోలపై అరుణ సోషల్ మీడియాలో స్పందించారు. జైలు సూపరింటెండెంట్ అనుమతితోనే తాను శ్రీకాంత్‌కు కేర్‌టేకర్‌గా ఆస్పత్రికి వెళ్లినట్లు వివరించారు.
సెటిల్మెంట్ల కోసం ఆస్పత్రికి...
పోలీసు వాహనంలో శ్రీకాంత్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తున్నప్పుడు అతని చేతికి గాయమయ్యేంత ప్రమాదం జరిగిందని రక్షణగా ఉన్న సాయుధ పోలీసులు చెప్పారు. అయితే పోలీసు వాహనం దెబ్బతిన్నట్లు ఎక్కడా కూడా లేదు. ఈ అనుమానాలపై లోతుగా విచారిస్తే సంచలన విషయాలు బయటికి వస్తాయంటూ ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు కూపీ లాగారు. ప్రతి రెండు, మూడు వారాలకు ఒకసారి ఏదో ఒక అనారోగ్య సమస్య చెప్పి శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తిరుపతి ఆస్పత్రికి వెళ్లేవాడు. పోలీసు వాహనం గూడూరు దాటగానే సెక్యూరిటీ సిబ్బందిని మేనేజ్ చేసేవాడు. తన గ్యాంగ్ తీసుకొచ్చిన ప్రైవేటు కారులో అరుణతో కలిసి ప్రయాణించేవాడు. ఏ సెటిల్మెంట్ చేయాలో ఆమె చెబితే, సంబంధిత వ్యక్తులను ఫోన్‌లో బెదిరించడం లేదా ఆస్పత్రికి రప్పించేవాడని, అలా సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుతోనే అరుణ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తోందని, శ్రీకాంత్‌ను తరచూ బయటికి రప్పించేందుకు ఖర్చు చేస్తోందని పోలీసులకు పూర్తి సమాచారం అందింది. జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్‌తో గతేడాది ఫిబ్రవరిలో అరుణకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ శ్రీకాంత్ తన భర్త అని చెబుతోంది.