ఖరీఫ్‌నకు ఊపిరి
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:41 AM
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు అన్నదాతలను ఆదుకున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో వేసిన వరి నారుమడులు, వరి నాట్లు వర్షాభావం వల్ల ఎండిపోతున్న తరుణంలో ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలు రైతులకు ఎంతో మేలు చేశాయి.
రైతన్నను ఆదుకున్న భారీ వర్షాలు
వరి నారుమడులు, వరి నాట్లు ఎండిపోతున్న తరుణంలో కరుణించిన వరుణుడు
పొలాల్లో పుష్కలంగా చేరిన నీరు
ఊపందుకున్న వ్యవసాయ పనులు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు అన్నదాతలను ఆదుకున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో వేసిన వరి నారుమడులు, వరి నాట్లు వర్షాభావం వల్ల ఎండిపోతున్న తరుణంలో ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలు రైతులకు ఎంతో మేలు చేశాయి. మంగళవారం వర్షం కురవకపోవడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఎక్కడ చూసిన వరి నాట్లు వేయడం, దమ్ము చేస్తున్న దృశ్యాలే కనిపించాయి.
జిల్లాలో ఈ ఏడాది ఆగస్టు నెల రెండో వారం ముగిసిపోతున్నా సరైన వర్షాలు లేకపోవడంతో వరి నారుమడులు సిద్ధం చేసుకున్నా, నీరు లేక చాలా మంది రైతులు నాట్లు పూర్తి చేసుకోలేకపోయారు. దేవరాపల్లి, మాడుగుల మండలాల్లో కొంతవరకు నాట్లు వేసుకోగలిగారు. ఇప్పటికే వరి నారుమడులు సిద్ధం చేసుకున్న రైతులు నాట్లు వేసేందుకు వర్షాల కోసం ఎదురు చూశారు. రెండు రోజుల కిందట జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో అన్నదాతలు వ్యవసాయ పనులు మరింత ముమ్మరం చేస్తున్నారు. వెదజల్లే పద్ధతిలో వరి నాట్లు వేసిన రైతులు పొలాల్లో చేరిన వర్షపు నీటిని బయటకు పంపే పనుల్లో నిమగ్నమయ్యారు. కొన్ని చోట్ల దుక్కి, దమ్ము పనులు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 55 వేల హెక్టార్లలో వరి సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయాధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
రైతులకు అందుబాటులో కాంప్లెక్స్ ఎరువులు
జిల్లాలో రెండు వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని జిల్లా వ్యవసాయాధికారి బి.మోహన్‌రావు తెలిపారు. జిల్లాలో మంగళవారం నాటికి 10 వేల హెక్టార్లలో వరి నాట్లు పూర్తయ్యాయన్నారు. ప్రస్తుతం పొలాల్లో పుష్కలంగా నీరు చేరడంతో ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా మూడు వేల హెక్టార్లలో వరి నాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ నెలాఖరు నాటికి 40 వేల హెక్టార్లలో వరి నాట్లు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. రైతులు దమ్ములో యూరియా వేసేందుకు మొగ్గు చూపడం సరికాదని, దమ్ములో కాంప్లెక్స్ ఎరువులు వేయాలని సూచించారు. డీఏపీలో కూడా నత్రజని ఉన్నందున దమ్ములో ఏడీపీ వేయాలన్నారు. జిల్లాలో రైతు సేవా కేంద్రాల్లో కాంప్లెక్స్ ఎరువులు రెండు వేల టన్నుల వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. డీఏపీ బస్తా రూ.1,350కి అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
గొలుగొండ మండలంలో..
కృష్ణాదేవిపేట: గొలుగొండ మండలంలో మంగళవారం రైతులు దుమ్ములు, వరినాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. కొంగసింగి, పాతకృష్ణాదేవిపేట, చోద్యం, లింగంపేట, ఏఎల్‌పురం, సీహెచ్ నాగాపురం, తదితర గ్రామాల్లో రైతులు వరినాట్లతో పాటు ట్రాక్టర్‌తో దమ్ములు చేయిస్తున్నారు. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఖరీఫ్, రబీ వరినాట్లకు ఇబ్బందులు తొలగినట్టేనని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.