పనులకు బ్రేక్!
ABN , Publish Date - Sep 24 , 2025 | 01:05 AM
ఉమ్మడి కృష్ణాజిల్లాలో జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులను కాంట్రాక్టర్లు నిలుపుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినా.. ఆర్థిక శాఖ నుంచి నగదు విడుదల చేయకపోవటాన్ని నిరసిస్తూ పూర్తిగా ఆపేశారు. ఈ నెల 4వ తేదీన ప్రభుత్వం రూ.152 కోట్ల నిధులను కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. ఈ నిధులు చెల్లింపునకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్‌ఓ) కూడా ఇచ్చింది. దీని తర్వాత పే అండ్ అకౌంట్స్ విభాగం నుంచి కూడా చెల్లింపులకు క్లియరెన్స్ వచ్చింది. ఆర్థికశాఖ నుంచి మాత్రం ఎంతకీ నిధులు విడుదల కావటం లేదు. దీంతో కాంట్రాక్టర్లలో తీవ్ర అసహనం నెలకొంది.
- జల్ జీవన్ మిషన్ పనులు పూర్తిగా ఆపేసిన కాంట్రాక్టర్లు
- ఉమ్మడి కృష్ణాజిల్లాలో చిన్న కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయి రూ.35 కోట్లు
- ఇటీవలే నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ
- బడ్జెట్ రిలీజ్ ఆర్డర్, పే అండ్ అకౌంట్స్ క్లియరెన్స్ పూర్తి
- అయినా ఆర్థిక శాఖ నుంచి విడుదల కాని నగదు
- 26న డిప్యూటీ సీఎం ఆఫీసు ముందు ధర్నాకు కాంట్రాక్టర్ల సన్నద్ధం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఉమ్మడి కృష్ణాజిల్లాలో జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులను కాంట్రాక్టర్లు నిలుపుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినా.. ఆర్థిక శాఖ నుంచి నగదు విడుదల చేయకపోవటాన్ని నిరసిస్తూ పూర్తిగా ఆపేశారు. ఈ నెల 4వ తేదీన ప్రభుత్వం రూ.152 కోట్ల నిధులను కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. ఈ నిధులు చెల్లింపునకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్‌ఓ) కూడా ఇచ్చింది. దీని తర్వాత పే అండ్ అకౌంట్స్ విభాగం నుంచి కూడా చెల్లింపులకు క్లియరెన్స్ వచ్చింది. ఆర్థికశాఖ నుంచి మాత్రం ఎంతకీ నిధులు విడుదల కావటం లేదు. దీంతో కాంట్రాక్టర్లలో తీవ్ర అసహనం నెలకొంది. ఇటీవల ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు కాంట్రాక్టర్లు రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం నేతల దృష్టికి తమ సమస్యలను తీసుకు వెళ్లి ఒత్తిడి తెచ్చారు. దీంతో కాంట్రాక్టర్ల సంఘం అగ్రనేతలు ఇటీవల ఆర్థిక శాఖ కార్యదర్శిని కలిశారు. ఆ సందర్భంలో వారికి సంతృప్తికర సమాధానం రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో కాంట్రాక్టర్లు జేజేఎం పనులను నిలుపుదల చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తంగా రూ.35 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. పెద్ద కాంట్రాక్టర్లు, కార్పొరేట్ కాంట్రాక్టర్లకు ఇంతకు ముందే డబ్బులు వచ్చేశాయి. ప్రస్తుం చిన్న కాంట్రాక్టర్లకే బకాయిలు రావాల్సి ఉంది. ప్రభుత్వం జీవో విడుదల చేయగానే.. తమ బిల్లులు వచ్చేస్తున్నాయని సంతోషంగా ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు ఆర్థికశాఖ నుంచి ఎంతకీ డబ్బులు విడుదల కాకపోవటం తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఇప్పటికే బిల్లులు ఇవ్వటం లేదని జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులను చాలా వరకు కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. ఆర్థికశాఖ తీరు గురించి తెలుసుకున్నాక.. తాజాగా పూర్తిగా పనులు నిలుపుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ సంఖ్యలో బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ కార్యాలయానికి వచ్చిన నివేదిక ప్రకారం రూ.700 కోట్ల మేర బిల్లింగ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇందులో ప్రాధాన్యతాక్రమంలో ప్రభుత్వం రూ. 152 కోట్లను విడుదల చేసింది. ఉమ్మడి కృష్ణాజిల్లా చిన్న కాంట్రాక్టర్లు సగం బకాయిలు అయినా వస్తాయని ఆశించారు.
26న ఆందోళనకు కాంట్రాక్టర్ల పిలుపు
జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలను కాదని ఆర్థిక శాఖ డబ్బులు చెల్లించకపోవటాన్ని నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన ఆందోళన చేపట్టాలని కాంట్రాక్టర్లు పిలుపునిచ్చారు. ముందు ఈఎన్‌సీ కార్యాలయం దగ్గర అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం దగ్గర ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ కలాణ్ చూపిన చొరవ కారణంగానే ప్రభుత్వం రూ.152 కోట్లను కేటాయిస్తూ జీవో ఇచ్చిందని, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్‌వో)ను కూడా పవన్ కళ్యాణ్ ఇప్పించారని చెబుతున్నారు. దీనిపై ఆయనే మళ్లీ స్పందించి తమకు బిల్లులు ఇప్పించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.