Brahmani Urges: విలువలతో కూడిన విద్యనందించాలి
ABN , Publish Date - Nov 29 , 2025 | 05:01 AM
బడి పిల్లలకు సమాజానికి అవసరమైన విలువలతో కూడిన విద్యను అందించాలని మంత్రి లోకేశ్ సతీమణి, హెరిటేజ్ కంపెనీ ఈడీ నారా బ్రాహ్మణి ఉపాధ్యాయులను కోరారు...
హిందూపురం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): బడి పిల్లలకు సమాజానికి అవసరమైన విలువలతో కూడిన విద్యను అందించాలని మంత్రి లోకేశ్ సతీమణి, హెరిటేజ్ కంపెనీ ఈడీ నారా బ్రాహ్మణి ఉపాధ్యాయులను కోరారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో శుక్రవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. చోళసముద్రం వద్ద ఉన్న హెరిటేజ్ పాలడెయిరీని, తూమకుంటలోని హెరిటేజ్ దాణా పరిశ్రమను సందర్శించారు. చిలమత్తూరు జూనియర్ కళాశాలకు హెరిటేజ్ సంస్థ తరఫున కంప్యూటర్‌ను అందించారు. లేపాక్షి నవోదయ పాఠశాలను సందర్శించారు. కుర్లపల్లి, పూలకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రింటర్లను అందించారు. పూలకుంట పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఉపాధ్యాయులు, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. లోకేశ్, తాను విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. విద్యార్థులకు జీవితానికి ఉపయోగపడే విద్యను విద్యార్థి దశలోనే నేర్పాలని టీచర్లను కోరారు. స్త్రీలను గౌరవించడం, తల్లి, చెల్లి వద్ద ఎలా ఉండాలో నేర్పించాలన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఆడబిడ్డలను చదివించాలని, తమ కుటుంబంలో మహిళలకు సమాన ప్రాధాన్యం ఇచ్చినందుకే బాగా చదువుకోగలిగానని, మంచిఉద్యోగం కూడా సంపాదించానని తెలిపారు. గురువులు, తల్లిదండ్రుల సూచనలను అనుసరిస్తూ, స్నేహపూర్వకంగా మెలగాలని విద్యార్థులకు సూచించారు. హిందూపురం తనకు పుట్టినిల్లువంటిందని, ఇక్కడి నుంచి తన తాత నందమూరి తారక రామారావు, పెదనాన్న హరికృష్ణ, తండ్రి బాలకృష్ణ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని ఆమె గుర్తు చేశారు. అందుకే హిందూపురాన్ని నందమూరి పురం అంటుంటారని బ్రాహ్మణి వాఖ్యానించారు.