AP Government: బొగ్గు కాదు బూడిద
ABN , Publish Date - Aug 31 , 2025 | 06:28 AM
రాష్ట్రంలోని కూటమి సర్కారు పెనుభారం నుంచి త్రుటిలో బయటపడింది. జార్ఖండ్‌లోని బ్రహ్మదీయ బొగ్గు గనిలో 26 శాతం బూడిదే ఉందని తాజాగా వెల్లడైంది. దీంతో ఆ ప్రాజెక్టుపై రూ.1,300 కోట్ల పెట్టుబడులు...
బ్రహ్మదీయ కోల్ బ్లాక్‌లో 26 శాతం బూడిదే
రూ.వేల కోట్ల ఆదాయం రావడం ఒట్టి మాటే
ప్రభుత్వాన్ని హెచ్చరించిన అధ్యయన సంస్థ
జగన్ హయాంలో ఏపీకి కేటాయించిన కేంద్రం
ఏ అధ్యయనం చేయకుండానే గుడ్డిగా ముందుకు
అనుమతులు, భూసేకరణకు 120 కోట్ల వ్యయం
మరో రూ.1,300 కోట్లు పెట్టుబడులకూ సిద్ధం
ఆ బొగ్గు ఎందుకూ పనికిరాదని తాజాగా నిర్ధారణ
గ్రేట్ ఎస్కేప్
ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయం
రూ.313 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు వెనక్కొచ్చే చాన్స్
కూటమి సర్కారు ముందుచూపుతో తప్పిన భారం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోని కూటమి సర్కారు పెనుభారం నుంచి త్రుటిలో బయటపడింది. జార్ఖండ్‌లోని బ్రహ్మదీయ బొగ్గు గనిలో 26 శాతం బూడిదే ఉందని తాజాగా వెల్లడైంది. దీంతో ఆ ప్రాజెక్టుపై రూ.1,300 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావించిన ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. కేంద్రంతో సంప్రదించి ఏకంగా ప్రాజెక్టు నుంచి బయటపడాలని నిర్ణయించింది. జార్ఖండ్ రాష్ట్రం గిరిధ్ జిల్లా బ్రహ్మదీయ ప్రాంతంలోని బొగ్గు గనిలో నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, వాటిని తవ్వితీసి అమ్ముకుంటే రూ.వేల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర బొగ్గు విభాగం ఆశలు కల్పించింది. ఈ మాటలు నమ్మిన గత జగన్ ప్రభుత్వం అత్యుత్సాహంతో సొంత అధ్యయనం చేయకుండానే ముందడుగు వేసింది. కేంద్ర బొగ్గు శాఖ నిర్వహించిన వేలంలో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పాల్గొని ఆ బ్లాక్‌ను దక్కించుకుంది. రూ.313 కోట్ల బ్యాంకు గ్యారంటీలు చెల్లించింది. ఈ ప్రాజెక్టులో జార్ఖండ్‌కు 41 శాతం వాటా ఇచ్చేందుకూ అంగీకరించింది. అక్కడ మైనింగ్ చేపట్టేందుకు లెకాన్ అనే ప్రైవేటు డెవలపర్‌ను ఎంపిక చేసింది. ప్రాజెక్టు కాలవ్యవధి కనీసం ఐదేళ్ల పాటు ఉంటుందని, 5 మిలియన్ టన్నుల స్టీల్ గ్రేడ్-1 బొగ్గు నిక్షేపాలున్నాయని కేంద్ర బొగ్గు విభాగం ముందుగానే చెప్పింది. ఇందులో 1.92 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వి తీయవచ్చని, సగటున ఒక టన్నుకు 10.5 క్యూబిక్ మీటర్ల లోతున తవ్వకాలు చేపట్టవచ్చని తెలిపింది.
వీటిని నమ్మి ఏపీఎండీసీ బొగ్గు తవ్వకాలు చేపట్టడానికి అవసరమైన పర్యావరణ, అటవీ, రెవెన్యూ, పంచాయతీ వంటి అనేక అనుమతులు, భూసేకరణకు గాను 2021 నుంచి ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం రూ.120 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. కానీ అక్కడ నాణ్యమైన బొగ్గు ఉండదని, చాలా లోతుగా మైనింగ్ చేయాల్సి ఉంటుందని, అప్పుడూ నాణ్యతపై చెప్పలేమంటూ అక్కడి జియాలజిస్టులు పలు సందర్భాల్లో వెల్లడించారు. అయినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ ప్రాజెక్టుపై ఓ ప్రైవేటు క ంపెనీతో అధ్యయనం చేయించింది. బ్రహ్మదీయ బ్లాక్‌లో బొగ్గు నాణ్యత, దాని భవిష్యత్తుపై సమగ్ర పరిశీలన చేయించింది. ఆ సంస్థ ఐదు నెలల క్రితమే నివేదిక ఇచ్చిందని, అందులో విస్తుపోయే అంశాలు ఉన్నాయని తెలిసింది. బ్రహ్మదీయ కోల్ బ్లాక్‌లో లభించే బొగ్గు ఏమాత్రం నాణ్యమైనది కాదని, దాన్ని నమ్ముకొంటే పెట్టుబడి ఖర్చులు కూడా రావని నిర్ధారణ అయింది. దీంతో కంగుతిన్న ఏపీ సర్కారు ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు త్వరలోనే సమాచారం ఇచ్చి బయటపడాలని భావిస్తోంది. అంతా సవ్యంగా సాగితే సర్కారుకు రూ.313 కోట్ల బ్యాంక్ గ్యారంటీలే వెనక్కి వస్తాయి. ఇప్పటివరకూ చేసిన ఖర్చంతా నష్టమే.
ముందుచూపు లేకుండా ముందుకు...
బ్రహ్మదీయ కోల్‌బ్లాక్ వేలం ఉంటుందని కేంద్ర బొగ్గు విభాగం ప్రకటించిన తర్వాత నాటి ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించాలి. వేలంలో పాల్గొనడానికి ముందే క్షేత్రస్థాయి అధ్యయన రిపోర్టు తెప్పించుకోవాలి. కానీ అలాంటిదేమీ చేయలేదు. మైనింగ్ ప్లాన్, మైనింగ్ ముగింపు ప్లాన్‌ల ఆధారంగానే వేలంలో పాల్గొన్నారు. సహజంగా ఏ కోల్‌బ్లాక్ లేదా మైనింగ్ బ్లాక్‌ను వేలం వేయాలనుకున్నా మైనింగ్ ప్లాన్ ఇస్తారు. ఈ విషయంలోనూ అదే జరిగింది. వేలంలో పాల్గొనడానికి ముందే, అక్కడ బొగ్గు నిల్వల గురించి సమగ్ర పరిశీలన చేసుకోవాలి. శాంపిల్స్‌ను పరీక్షించుకోవాలని చెప్పింది. కానీ నాటి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలేవీ తీసుకోలేదు. పెట్టుబడులు పెట్టకముందే బొగ్గు నాణ్యతను పరిశీలించి ఉంటే, అందులో 26 శాతం బూడిద కంటెంట్ ఉందన్న విషయం అప్పుడే బయటపడేది. బ్రహ్మదీయ కోల్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెడితే పైసా లాభం రాదని అధ్యయన సంస్థ తేల్చిచెప్పింది. లాభం సంగతి పక్కనపెడితే, ఊహించని నష్టాలు వస్తాయని, ప్రాజెక్టు నిర్వహణపై పెట్టే ఖర్చంతా వృథా అవుతుందని హెచ్చరించింది. అధ్యయన సంస్థ నివేదికతో పాటు బ్రహ్మదీయ కోల్ బ్లాక్ వద్ద పరిస్థితిపై గనుల శాఖ ఇటీవల ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం అత్యంత నష్టదాయకమని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో మాట్లాడి ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇదే విషయమై త్వరలో ఢిల్లీకి అధికారుల బృందాన్ని పంపనున్నట్లు తెలిసింది.
గణాంకాల మాయ
బ్రహ్మదీయ కోల్ బ్లాక్‌లో 2.215 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర బొగ్గు విభాగం చెప్పినదంతా అవాస్తవమని తాజా అధ్యయనంలో బయటపడింది. అక్కడ కేవలం 1.12 మిలియన్ టన్నుల నిల్వలే ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
మైనింగ్ చేయగ లిగిన బొగ్గు నిల్వలు 1.92 మిలియన్ టన్నులని కేంద్రం చెబితే, కేవలం 0.62 మిలియన్ టన్నుల నిల్వలున్నాయని అధ్యయన సంస్థ చెప్పింది.
అక్కడ స్టీల్ గ్రేడ్-1 రకం బొగ్గు ఉందని కేంద్రం అంటే, కేవలం వాషరే గ్రేడ్-4 రకం ఉంటుందని నివేదిక పేర్కొంది.
అక్కడ తవ్వి తీసే బొగ్గు టన్నుకు రూ.15,955 మార్కెట్ రేటు ఉంటుదని కేంద్రం చెబితే, అంత ధర రానేరాదని, టన్ను రేటు రూ.3,195 మాత్రమే ఉందని అధ్యయన సంస్థ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును కొనసాగిస్తే తీవ్ర ఆర్థిక నష్టం వస్తుందని హెచ్చరించింది. లాభాలు రాకపోగా, నష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయని, ఆపరేటింగ్ ప్రాఫిట్ మైనస్ రూ.306 కోట్లు ఉండొచ్చని తేల్చిచెప్పింది.