BPCL: రామాయపట్నం రిఫైనరీపై మరో ముందడుగు
ABN , Publish Date - Oct 29 , 2025 | 03:15 AM
ఆంధ్రప్రదేశ్‌లోని రామాయపట్నం సమీపాన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ/పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం దిశగా మరో ముందడుగు పడింది.
ఆయిల్ ఇండియాతో బీపీసీఎల్ అవగాహనా ఒప్పందం
ప్రాజెక్టు ఏర్పాటుకు పరస్పర సహకారం.. ఓఐఎల్‌కు ఈక్విటీ
ఇప్పటికే రిఫైనరీకి కీలక అనుమతులు, 6 వేల ఎకరాలు
ఈ ప్రాజెక్టుతో ఇంధన, పెట్రో కెమికల్స్‌లో స్వావలంబన: బీపీసీఎల్
అమరావతి/హైదరాబాద్ సిటీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని రామాయపట్నం సమీపాన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ/పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం దిశగా మరో ముందడుగు పడింది. దీని స్థాపనలో పరస్పర సహకార అవకాశాలను అన్వేషించేందుకు బీపీసీఎల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్)తో అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న 28వ ఎనర్జీ టెక్నాలజీ మీట్-2025లో మంగళవారం ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఎంవోయూ పత్రాలను కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సమక్షంలో బీపీసీఎల్ డైరెక్టర్/ఇన్‌చార్జి సీఎండీ సంజయ్ ఖన్నా, ఓఐఎల్ చైర్మన్ రంజిత్ రథ్ మార్చుకున్నారు. రూ.లక్ష కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో.. ఏటా 9-12 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏ) సామర్థ్యంతో రామాయపట్నం సమీపాన గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ/పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్న సంగతి తెలిసిందే. రిఫైనరీ ఏర్పాటుకు అవసరమైన కీలక అనుమతులన్నీ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి భూములు కూడా ఇచ్చింది. ప్రస్తు తం ప్రాజెక్టు ముందస్తు పనులు సాగుతున్నాయి. సంజయ్ ఖన్నా మాట్లాడుతూ.. బీపీసీఎల్-ఓఐఎల్ సహకారం దక్షిణ భారతంలో ప్రపంచ స్థాయి రిఫైనరీ-పెట్రోకెమికల్ ప్లాంటు నిర్మించే దిశగా కీలక మైలురాయిగా అభివర్ణించారు.
ఓఐఎల్‌తో చేతులు కలపడం ద్వారా వ్యూహాత్మక, సుస్థిర ప్రాజెక్టు స్థాపనకు తమ బలాలను ఏకం చేస్తున్నామని.. రామాయపట్నం రిఫైనరీ బీపీసీఎల్ ఆర్థిక స్వరూపాన్ని మార్చడమే గాక.. ఆత్మనిర్భర భారత్ విజన్‌తో ఇంధనం, పెట్రోకెమికల్స్ రంగాల్లో భారత స్వావలంబనకు చేయూతనిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రప్రభుత్వ సహకారంతో 2030 నాటికి ఈ ప్రాజెక్టులో వాణిజ్య కార్యక్రమాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. మంగళవారం బీపీసీఎల్ కుదుర్చుకున్న మూడు ఎంవోయూల్లో ఇదే అతిపెద్దది. అలాగే రూ.3,500 కోట్లతో నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్ విస్తరణకు సంబంధించి కూడా బీపీసీఎల్, ఓఐఎల్ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అసోంలోని సిలిగురి నుంచి యూపీలోని ముగల్‌సరాయ్ వరకు 700 కిలోమీటర్ల మేర క్రాస్‌కంట్రీ ప్రొడక్ట్ పైపులైన్ నిర్మిస్తారు. మోటార్ స్పిరిట్ (ఎంఎస్), హైస్పీడ్ డీజిల్ (హెచ్‌ఎ్‌సడీ), ఏవియేషన్ టర్బయిన్ ఫ్యుయల్ (ఏటీఎ్‌ఫ)ను ఈ పైపులైన్ గుండా రవాణా చేస్తారు. ఎన్‌ఆర్‌ఎల్ సామర్థాన్ని ఇప్పుడున్న 3 ఎంఎంటీపీఏను 9 ఎంఎంటీపీఏకు పెంచుతారు. ఇంకోవైపు.. కేరళలోని కోచి రిఫైనరీ సమీపాన బ్రహ్మపురంలో మున్సిపల్ వ్యర్థాల ఆధారంగా నెలకొల్పిన తమ కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంటులో ఫెర్మెంటెడ్ సేంద్రియ ఎరువులు, లిక్విడ్ ఫెర్మెంటెడ్ సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి ఫెర్టిలైజర్స్-కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్)తో బీపీసీఎల్ మూడో ఎంవోయూ కుదుర్చుకుంది.