Share News

Ramayapatnam: బీపీసీఎల్‌కు 6వేల ఎకరాలు

ABN , Publish Date - Oct 08 , 2025 | 04:11 AM

ష్ట్రంలో ఓ భారీ ప్రాజెక్టు పెట్టుబడులు సాకారం కావడానికి చకచకా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)...

 Ramayapatnam: బీపీసీఎల్‌కు 6వేల ఎకరాలు

  • రామాయపట్నం ఓడరేవు సమీపంలో కేటాయింపు

  • 96 వేల కోట్లతో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు

  • భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వం

  • త్వరలోనే పట్టాలెక్కనున్న మెగా ప్రాజెక్టు

  • 2029 జనవరికి వాణిజ్య కార్యకలాపాలు

  • వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓ భారీ ప్రాజెక్టు పెట్టుబడులు సాకారం కావడానికి చకచకా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) రూ. 96,862 కోట్ల పెట్టుబడితో రామాయపట్నం ఓడరేవు సమీపంలో గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ (భారీ చమురు శుద్ధి కర్మాగారం) ఏర్పాటు చేయనుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 6 వేల ఎకరాలను కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం ఆర్థిక ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఏడాదికి 9 నుంచి 12 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో ఈ అలా్ట్ర మెగా ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి 20 సంవత్సరాల కాలంలో రూ. 96 వేల కోట్లకుపైగా ఆర్థిక ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధి విధానం 4.0 కింద టైలర్‌ మేడ్‌ ఇన్సెంటివ్స్‌ విడుదలకు ఎస్ర్కో ఆధారిత యంత్రాంగం కోసం ఆర్థిక శాఖతో సంప్రదింపులు కూడా చేసింది. మొత్తం 15 వాయిదాలలో 43.5 శాతం మూలధన సబ్సిడీ, జీఎస్టీ పూర్తిగా వాపసు, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఐజీఎస్టీ/సీజీఎస్టీలో రాష్ట్రం వాటా, రాష్ట్రం వసూలు చేసే సీఎ్‌సఎస్‌ చార్జీల రీయింబర్స్‌మెంట్‌, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు పూర్తిగా మినహాయింపు తదితర ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీకి ఆ ఉత్తర్వుల్లో ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో భారీ పెట్టుబడితో బీపీసీఎల్‌ చేపట్టిన ఈ అలా్ట్ర మెగా ప్రాజెక్టు పనులు అతి త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.


మారనున్న పారిశ్రామిక ముఖచిత్రం

మొత్తం ప్రాజెక్టును 2029 జనవరి నాటికి పూర్తి చేసి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు బీపీసీఎల్‌ ఇప్పటికే సమగ్ర ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం కేటాయించిన 6 వేల ఎకరాల్లో మొదటి బ్లాక్‌ 787 ఎకరాల్లో టౌన్‌షిప్‌, లెర్నింగ్‌ సెంటర్‌, ఎస్‌డీఐ, రెండో బ్లాక్‌ 2,333 ఎకరాల్లో రిఫైనరీ, పెట్రో కెమికల్‌ యూనిట్లు, మూడో బ్లాక్‌లోని 1,085 ఎకరాల్లో అడ్మినిస్ట్రేషన్‌ బ్లాకులు, ఉత్పత్తి ట్యాంకులు, నాలుగో బ్లాక్‌లోని 800 ఎకరాల్లో ముడి చమురు టెర్మినల్‌, ఐదో బ్లాక్‌లోని 1,000 ఎకరాల్లో గ్రీన్‌హెచ్‌2/ రెన్యువబుల్స్‌ నిర్మిస్తారు. మొత్తం భూమిని ఫ్రీహోల్డ్‌ ప్రాతిపదికన తీసుకోవడానికి బీపీసీఎల్‌ అభ్యర్థించింది. ఆ సంస్థ సమర్పించిన అంచనాల ప్రకారం గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ కోసం రూ. 96,862 కోట్ల భారీ పెట్టుబడి పెట్టడం వల్ల రాష్ట్రానికి గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు, వ్యాట్‌, ఎస్జీఎస్టీ, ఇతర వనరుల నుంచి ఆదాయం లభిస్తుంది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా వచ్చే 15 ఏళ్లలో రాష్ట్రానికి రూ. 87,558 కోట్ల స్థూల ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు. నిర్దేశిత సమయం ప్రకారం ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోతుంది. పెద్దఎత్తున అనుబంధ పరిశ్రమల రాకతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు తీయనుంది. వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Updated Date - Oct 08 , 2025 | 04:12 AM