సంప్‌లో పడి బాలుడి మృతి
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:45 PM
రెండేళ్ల బాలుడు ఇంటి ముందున్న సంప్‌లో పడి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో జరిగింది.

కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు
ఆదోని రూరల్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : రెండేళ్ల బాలుడు ఇంటి ముందున్న సంప్‌లో పడి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గిరిబాబు, లక్ష్మి దంపతులకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల ఉన్నారు. రెండేళ్ల బాలుడు వరుణ్ తేజ్ శనివారం ఇంట్లో ఆడుకుంటుండగా, ఇంటి వద్ద ఏర్పాటు చేసుకొన్న సంప్ నుంచి తల్లి లక్ష్మి నీటిని ఇంట్లోకి తెస్తోంది. ఆమె ఇంట్లోకి వెళ్లినప్పుడు బాలుడు ఆడుకుంటూ, మరో తలుపు ద్వారా బయటకెళ్ళి ప్రమాదవశాత్తు సంప్‌లో పడిపోయాడు. ఇంట్లో కొడుకు కనిపించక పోవడంతో తల్లి పరుగున బయటకెళ్ళి వీధిలో, పొరుగు వారి ఇండ్లలో చూసింది. కనిపించకపోవడంతో సంప్‌లో పడ్డాడేమోనని బ్యాటరీ వేసి చూసింది. సంప్‌లో బాలుడు కనిపించాడు. చుట్టు పక్కల వారు వచ్చి బాబును బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరుమని రోదించారు. పెద్దతుంబళం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.