Share News

Borugadda Released: గుంటూరు జైలు నుంచి బోరుగడ్డ విడుదల

ABN , Publish Date - Jun 14 , 2025 | 04:02 AM

రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కు అన్ని కేసుల్లో బెయిల్‌ మంజూరైంది. దీంతో శుక్రవారం అతడు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యాడు. వివిధ ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 50కి పైగా కేసులు నమోదయ్యాయి.

Borugadda Released: గుంటూరు జైలు నుంచి బోరుగడ్డ విడుదల

అన్ని కేసుల్లో కోర్టుల్లో బెయిల్‌ మంజూరు

గుంటూరు, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కు అన్ని కేసుల్లో బెయిల్‌ మంజూరైంది. దీంతో శుక్రవారం అతడు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యాడు. వివిధ ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 50కి పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో 15 కేసులు ఒక్క గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌, జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై గుంటూరుతో పాటు అనంతపురంలో కూడా కేసు నమోదైంది. పెదకాకాని పోలీసు స్టేషన్‌ పరిధిలో మండల సర్వేయర్‌ చిరుమామిళ్ల మల్లికార్జునరావును 2016 మే 9న బెదిరించిన కేసులో గురువారం అతడికి బెయిల్‌ మంజూరైంది. దీంతో జైలు నుంచి బయటకు వచ్చాడు. గతంలో గుంటూరు అరండల్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఏఈఎల్‌సీ చర్చి వివాదంలో తలదూర్చి చర్చి ట్రెజరర్‌ కర్ణపూడి బాబూప్రకాశ్‌ను రూ.50 లక్షలు ఇవ్వాలని బోరుగడ్డ ఫోన్లో బెదిరించాడు. వీడియో క్లిప్పింగ్స్‌ పంపి బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. దీనిపై బోరుగడ్డతో పాటు ఆయన అనుచరుడైన పండ్ల వ్యాపారి హరిపై కేసు నమోదైంది. ఆ కేసులో గత అక్టోబరు 17న బోరుగడ్డను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. 18న కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించడంతో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆ తర్వాత పలు కేసుల్లో ఆయన్ను వివిఽధ కోర్టుల్లో పోలీసులు హాజరుపరుస్తూ వచ్చారు.

Updated Date - Jun 14 , 2025 | 04:05 AM