పర్యాటకానికి ఊతం
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:50 AM
జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వంలోనైనా మంగినపూడి బీచ్‌కు మహర్దశ వస్తుందని జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. వీరి నమ్మకాన్ని నిజం చేస్తూ మంగినపూడి బీచ్ (తాళ్లపాలెం బీచ్)ను అభివృద్ధి చేసేదిశగా ప్రభుత్వం సోమవారం జరిగిన కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది. అమ్యుజ్‌మెంట్ పార్క్‌తో పాటు రిసార్ట్‌ల నిర్మాణం కోసం మైరా బేవ్యూ రిసార్స్ట్ సంస్థకు భూమిని కేటాయించే అంశానికి ఆమోదం తెలిపింది. ఈ నెల 7వ తేదీన ఎస్‌ఐపీబీ సమావేశంలో మంగినపూడి బీచ్‌ను అభివృద్ధి చేయాలని, పర్యాటకులను ఆకర్షించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని క్యాబినెట్ సమావేశంలో ఆమోదం కోసం ఉంచగా, రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
- మచిలీపట్నం నార్త్ మండలం తాళ్లపాలెం వద్ద ‘మైరా’ రిసార్ట్‌లు!
- నిర్మాణానికి భూమి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం
- మచిలీపట్నంలో టీడీపీ కార్యాలయానికి 1.60 ఎకరాలు కేటాయింపు
- వేద ఇన్నోవేషన్ పార్క్, ప్లాటెడ్ ఫ్యాక్టరీ పనులను నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వంలోనైనా మంగినపూడి బీచ్‌కు మహర్దశ వస్తుందని జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. వీరి నమ్మకాన్ని నిజం చేస్తూ మంగినపూడి బీచ్ (తాళ్లపాలెం బీచ్)ను అభివృద్ధి చేసేదిశగా ప్రభుత్వం సోమవారం జరిగిన కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది. అమ్యుజ్‌మెంట్ పార్క్‌తో పాటు రిసార్ట్‌ల నిర్మాణం కోసం మైరా బేవ్యూ రిసార్స్ట్ సంస్థకు భూమిని కేటాయించే అంశానికి ఆమోదం తెలిపింది. ఈ నెల 7వ తేదీన ఎస్‌ఐపీబీ సమావేశంలో మంగినపూడి బీచ్‌ను అభివృద్ధి చేయాలని, పర్యాటకులను ఆకర్షించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని క్యాబినెట్ సమావేశంలో ఆమోదం కోసం ఉంచగా, రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
(ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం):
మచిలీపట్నంలో ప్రతిష్ఠాత్మకమైన బందరు పోర్టు పనులు ఇప్పటికే 40శాతం పూర్తయ్యాయి. పోర్టు అభివృద్ధి చెందితే వ్యాపారులు, ఇతరత్రా సంస్థల వారు ఇక్కడకు వస్తారు. ఈ నేపథ్యంలో వివిధ పనులపై మచిలీపట్నం వచ్చేవారికి ఆహ్లాదాన్ని పంచేందుకు స్టార్ హోటల్స్ యజమానులు మంగినపూడి బీచ్ సమీపంలో త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటల్స్ నిర్మాణం చేస్తామనే ప్రతిపాదనలతో ముందుకు వచ్చారు. తమకు భూములు కేటాయిస్తే రూ.150 కోట్ల పెట్టుబడితో ఇక్కడ స్టార్ హోటల్స్ నిర్మాణం చేస్తామనే ప్రతిపాదనలు కూడా పెట్టారు. వన్‌స్టార్, ఒబెరాయ్, మైరా బేవ్యూ రిసార్స్ట్ వంటి సంస్థలు ముందుకు వచ్చి 100 ఎకరాల భూమిని కేటాయించాలని కోరాయి. ఈ ప్రతిపాదనలపై రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులు పలుమార్లు కలెక్టర్‌తో సమావేశాలు కూడా నిర్వహించారు. మంగినపూడి బీచ్ ఎదురుగా 80 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. 20 సంవత్సరాల క్రితం రిసార్ట్‌ల నిర్మాణానికి ఈ భూమిని కేటాయించారు. భూమిని తీసుకున్న రిసార్ట్‌ల నిర్వాహకులు పెద్ద ఎత్తున భవనాలు నిర్మాణం చేసి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా, నామ మాత్రంగా రెండు, మూడు భవనాలు నిర్మాణం చేసి మమ అనిపించారు. దీంతో ఈ రిసార్ట్‌లు నామమాత్రంగానే ఉండిపోయాయి. ఏడాదిన్నర కాలం క్రితం ఒబెరాయ్, వన్‌స్టార్ వంటి సంస్థల ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని బీచ్ ఎదురుగా ఉన్న 80 ఎకరాలతో పాటు తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని సత్రవపాలెంలోని ప్రభుత్వ భూములను అధికారులు సర్వే చేయించారు. ఇక్కడ హోటల్స్ నిర్మాణానికి భూములు కేటాయించే ప్రతిపాదనలు తయారు చేసినా, ప్రభుత్వ ఆమోదం ఇంతకాలంగా లభించలేదు. ఎట్టకేలకు సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంగినపూడి బీచ్ సమీపంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం రిసార్ట్‌ల నిర్మాణానికి ఆమోదం లభించింది.
మసులా బీచ్ ఫెస్టివల్‌తో పర్యాటక రంగం అభివృద్ధికి బీజం
ఈ ఏడాది జూలైలో నిర్వహించిన మసులాబీచ్ ఫెస్టివల్ సందర్భంగా మచిలీపట్నానికి ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మసులా బీచ్ ఫెస్టివల్‌కు వచ్చిన అర్జ్జున అవార్డు గ్ర హీతలు, వివిధ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులతో మంత్రి కొల్లు రవీంద్ర, శాప్‌చైర్మన్ రవినాయుడు, కలెక్టర్ బాలాజీ చర్చలు జరిపారు. మంగినపూడి బీచ్, గిలకలదిండి హార్బర్ తదితర ప్రాంతాల్లో బీచ్ కబడ్డీ పోటీలు, జలక్రీడలు, కయాకింగ్ పోటీల నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. దీంతో పాటు క్రీడాకారులకు కోచింగ్ ఇచ్చేందుకు ఎలాంటి సౌకార్యలు కల్పించాలనే అంశంపైనా, అందుకు అవసరమైన భూమి, నిధుల కేటాయింపు తదితర అంశాలపై కూడా చర్చించారు. తొలి విడతగా మంగినపూడి బీచ్‌ను అభివృద్ధి చేస్తే రానున్న రోజుల్లో వ్యాపారసంస్థలు, హోటల్స్ నిర్మాణంతోపాటు ఇతరత్రా వ్యాపారాలను విస్తరించేందుకు అవకాశాలు మెరుగవుతాయి.
టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయింపు
మచిలీపట్నం నార్త్ మండలంలోని మాచవరంలో ఆర్‌ఎస్ నెంబరు 258/8లో 1.60 ఎకరాల ప్రభుత్వ భూమిని 33 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎకరానికి ఏడాదికి వెయ్యి రూపాయిలు లీజు చెల్లించాలని నిర్ణయించింది. గతంలో రవాణాశాఖకు ఈ భూమిని కేటాయించగా, సంబంధిత ఉత్తర్వులను రద్దు చేసి, టీడీపీ కార్యాలయం నిర్మాణం కోసం ఈ భూమిని బదిలీ చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
వేలేరులో వేద ఇన్నోవేషన్ పార్క్‌కు 40 ఎకరాలు
గన్నవరం నియోజకవర్గంలోని వేలేరులో వేద ఇన్నోవేషన్ పార్క్‌కు 40 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. వేద ఇన్నోవేషన్ పార్క్ నిర్మాణ పనులతో పాటు, మచిలీపట్నం నియోజకవర్గంలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం అనకాపల్లి జిల్లా నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్నారు. కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక ద్వారా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.