Share News

Telugu Ganga Project: లోకాయుక్త జోక్యంతో బోగస్‌ ఉద్యోగుల తొలగింపు

ABN , Publish Date - Dec 21 , 2025 | 04:43 AM

నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందిన ఐదుగురిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Telugu Ganga Project: లోకాయుక్త జోక్యంతో బోగస్‌ ఉద్యోగుల తొలగింపు

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనాల ఆధారంగా చర్యలు

కర్నూలు లీగల్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందిన ఐదుగురిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేల్‌కు చెందిన గట్టుపల్లి మల్లెం కొండారెడ్డి, కర్నూలు చెందిన వి.మురళీధర్‌ రెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కొంత మంది తమ భూములు తెలుగు గంగ ప్రాజెక్టులో కోల్పోయామని, నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి ఉద్యోగాలు పొందినట్టు ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. వీటి ఆధారంగా ఫిర్యాదుదారులు రాష్ట్ర లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ మేరకు లోకాయుక్త తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌కు, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. చీఫ్‌ ఇంజనీర్‌ విచారణ చేపట్టి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన ఐదుగురు ఉద్యోగులు వివిధ పదవుల్లో కొనసాగుతున్నట్టు గుర్తించారు. ఎన్‌.సూరిబాబు (జూనియర్‌ అసిస్టెంట్‌), డి.అనిల్‌ కుమార్‌ రెడ్డి (టైపిస్టు), కె.రామమోహన్‌ రెడ్డి (టైపిస్టు), బి.సుబ్బయ్య (ఆఫీస్‌ సబార్డినేట్‌), పి.సురేశ్‌ కుమార్‌ (టెక్నికల్‌ అసిస్టెంట్‌) నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్టు విచారణలో తేలింది. వారిని ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా క్రిమినల్‌ కేసులు దాఖలు చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీకి సిఫారసు చేసినట్టు తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ తన రిపోర్టును ఈ నెల 16న ఉప లోకాయుక్తకు నివేదించారు. నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి ఉద్యోగాలు పొందిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఉప లోకాయుక్త పి.రజని ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Dec 21 , 2025 | 04:44 AM