Share News

Chandrababu Naidu: రెవెన్యూ అవస్థలకు తక్షణమే స్వస్తి

ABN , Publish Date - Dec 18 , 2025 | 04:09 AM

రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూలోని దురవస్థలకు ఈ రోజే, తక్షణమే ముగింపు పలకాలని స్పష్టంచేశారు.

Chandrababu Naidu: రెవెన్యూ అవస్థలకు తక్షణమే స్వస్తి

  • బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ తెస్తున్నాం: ముఖ్యమంత్రి

  • ఫైళ్ల పరిష్కారమంటే కిందకు తోసెయ్యడమే!

  • తన వద్ద లేకుండా ఇతరులకు పంపేస్తున్నారు

  • దీనివల్లే ప్రజల్లో సంతృప్తి రావడం లేదు

  • లింక్‌ ఫైళ్లు కూడా మాయమయ్యాయి

  • దీంతో రెవెన్యూ శాఖను ట్రాక్‌ చేస్తున్నాం

  • ఇక ఫైలుపై ఎవరు ఏం రాసినా తీసివేయలేరు: సీఎం

అమరావతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూలోని దురవస్థలకు ఈ రోజే, తక్షణమే ముగింపు పలకాలని స్పష్టంచేశారు. ఫైళ్ల పెండింగ్‌కు సంబంధించి ‘పెండింగ్‌ పెద్దన్న’ శీర్షికన ఈ నెల 12న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫైళ్ల పరిష్కారం తీరుపై సీఎం కలెక్టర్ల సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొన్ని శాఖలు వ్యవస్థాగత లోపాలతో వ్యవస్థను దుర్వినియోగం చేయడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. రెవెన్యూ సమస్యలూ అందులో భాగమే. ఫైలు పరిష్కారమంటే.. పై నుంచి కిందకు తోసెయ్యడమే! తన వద్ద ఫైలు లేకుండా వేరేవాళ్లకు పంపించేయడమనే ధోరణికి వచ్చారు. దీంతో రెవెన్యూ సేవలపై ప్రజల్లో సంతృప్తి రావడం లేదు. అందుకే ఇప్పుడు రెవెన్యూలో ఫైల్‌ సిస్టమ్‌ను ట్రాక్‌ చేస్తున్నాం. ఎవరు ఏ విధంగా ఫైలు పరిష్కరిస్తున్నారో తెలుసుకుంటున్నాం’ అని తెలిపారు. రెవెన్యూలో కీలకమైన లింక్‌ ఫైళ్లు మాయమయ్యాయని, ప్రస్తుతం ఉన్న విధానంలో ఏ ఫైలు ఎక్కడికి వెళ్లిందో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యవస్థకు ఈరోజే ముగింపు పలకాలని, ఇందుకోసం బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ తీసుకొస్తున్నామని తెలిపారు. ‘దీనివల్ల ఫైలుపై ఎవరు ఏం రాసినా అందులో ఉంటుంది. దానిని తీసివేయలేరు. రేపటి రోజు ఆ అధికారి తప్పుచేశారు.. దుర్భుద్ధి ప్రదర్శించారంటే ఆటోమేటిగ్గా తెలిసిపోతుంది’ అని చెప్పారు. ప్రభుత్వంలో ఒక శాఖ అద్భుతంగా పనిచేస్తే, మరో శాఖ దాన్ని అందుకోలేకపోతోందన్నారు.


గూగుల్‌కు లోకేశ్‌ బీజం వేశారు..

మంత్రి లోకే శ్‌ గతంలో ఎప్పుడో అమెరికా వెళ్లినప్పుడే గూగుల్‌ రాక కోసం విత్తనం వేశారని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రీన్‌ ఎనర్జీ ఓ సానుకూల అంశమని.. అందుకే గూగుల్‌ ఆలోచించి 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి తో వస్తోందని.. ప్రభుత్వ పట్టుదలకు, పనితీరుకు ఇదే నిదర్శనమన్నారు.

కేంద్రం సీఎస్ఎస్‌ లెక్కలడిగింది..

కూటమి అధికారంలోకి రాకముందు కేంద్ర ప్రాయోజిత పథకాలు(సీఎ్‌సఎస్‌) పనిచేయకుండా పోయాయని సీఎం చెప్పారు. ఈ స్కీములను పునరుద్ధరించి సాయం చేయాలని ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కోరితే.. తనకో కౌంటర్‌ విష్‌లిస్టు ఇచ్చారని తెలిపారు. ‘మీ దగ్గర సీఎ్‌సఎస్‌ స్కీముల అకౌంట్స్‌ సరిగా లేవు.. మీ రాష్ట్రానికి డబ్బులిచ్చాం.. ముందు వాటికి లెక్కలు చెప్పండి తర్వాత మీ కోరికలపై మాట్లాడదామని కేంద్రం చెప్పింది. వెంటనే ఢిల్లీ నుంచి వచ్చి ఆ పథకాల వివరాలు చూశాం. డబ్బుల్లేవు.. దీంతొ దశల వారీగా క్లియర్‌ చేసి.. స్కీములను పట్టాలెక్కించాం’ అని వెల్లడించారు.

ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు

ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు సూపర్‌సిక్స్‌ హామీలను అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. ‘గతంలో ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మేం వచ్చాక సమస్యలను పరిష్కరించి ఒకటో తేదీనే ఇస్తున్నాం. ఒకవేళ ఆ రోజు సెలవైతే ముందు రోజే ఇస్తున్నాం. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం. కొందరికి ఆరుగురు, ఏడుగురు పిల్లలున్నా ఇస్తున్నాం. వారు భవిష్యత్‌ దేశభక్తులు. అన్నదాత సుఖీభవలో రెండో దశ చెల్లింపులు చేశాం. దీపం-2, స్త్రీశక్తి. మెగా డీఎస్సీ, కానిస్టేబుళ్ల నియామకాలు చేపట్టాం. ఇతర సంక్షేమ పథకాలను కూడా దారిలోకి తీసుకొచ్చాం. సూపర్‌సిక్స్‌పై ప్రజా సంతృప్తిస్థాయి 96 శాతం రావాలి’ అని కలెక్టర్లకు సూచించారు.


15 వేలు వస్తున్నా..

ఓ వ్యక్తికి రూ.15 వేలు పింఛనుగా వస్తోందని, ఇంకా పెంచాలని తనను కోరారని సీఎం ప్రస్తావించారు. ‘మంగళవారం టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి పిటిషన్లు తీసుకుంటుండగా ఓ వ్యక్తి నా వద్దకు వచ్చారు. తనకొస్తున్న పింఛను సరిపోవడం లేదని.. ఇబ్బందులు ఉన్నాయని, ఇంకా పెంచాలని అడిగారు. అందులో తప్పులేదు. అదొక ఆశ. కానీ మనం వారికి నచ్చజెప్పాలి’ అని వ్యాఖ్యానించారు.

ఇదీ ప్రభుత్వం అంటే..

పోలీసు కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసే సమావేశంలో జరిగిన సంఘటన గురించి సీఎం ప్రస్తావించారు. ‘కానిస్టేబుల్‌గా ఎంపికైన బాబూరావుతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడినప్పుడు.. మా ఊరికి రోడ్డులేదని కానిస్టేబుల్‌ చెప్పారు. ఆ వెంటనే ఆయన డిపార్ట్‌మెంట్‌కు మెసేజ్‌ చేయగా ఆ ఊరికి రోడ్డు వేయడానికి రూ.3.9 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. దీంతో పవ న్‌ న న్నడిగారు. వెంటనే అక్కడికక్కడే రోడ్డు మంజూరు చేశాం. ఆ మీటింగ్‌లోనే ప్రకటించాం. ఇదీ స్పందన అంటే. బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే ఇదీ’ అని అన్నారు. విభిన్న రంగం నుంచి వచ్చినా పవన్‌ స్ట్రగుల్‌ అవుతున్నారని చెప్పారు.

Updated Date - Dec 18 , 2025 | 04:10 AM