Share News

President PVN Madhav: ఒక చేత్తో బీజేపీ జెండా.. మరో చేతిలో కూటమి ఎజెండాతో..26 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తా

ABN , Publish Date - Jul 19 , 2025 | 06:18 AM

ఈ నెల 26 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ప్రకటించారు.

President PVN Madhav: ఒక చేత్తో బీజేపీ జెండా.. మరో చేతిలో కూటమి ఎజెండాతో..26 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తా

  • జిల్లాల పర్యటన కడప నుంచి మొదలు

  • త్వరలోనే జిల్లా, రాష్ట్ర కమిటీల నియామకం: మాధవ్‌

విశాఖపట్నం, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఈ నెల 26 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ప్రకటించారు. పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అన్ని జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నందున, దేవుడి గడపగా పేరొందిన కడప నుంచి దీనికి శ్రీకారం చుడతామన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోజుకొక జిల్లా చొప్పున పర్యటిస్తానని, తొలుత రాయలసీమ, ఆ తరువాత ఉత్తరాంధ్ర, చివరిగా కోస్తా జిల్లాలకు వెళతానన్నారు. బీజేపీకి నాయకుల అవసరం ఉందని, వారిని తయారుచేసే విధంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. త్వరలోనే జిల్లా కమిటీలు, ఆ తరువాత రాష్ట్ర కమిటీ నియామకం కూడా పూర్తిచేస్తామన్నారు. ప్రతి ఊరిలో బీజేపీ జెండా ఎగరాలనేది ధ్యేయమన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలతో కలసి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. స్వరాష్ట్ర భావన పెరిగేలా, మరోసారి రాష్ట్ర విభజనపై చర్చ రాకుండా ఉండేలా తెలుగు వారంతా కలిసి కట్టుగా ఉండేందుకు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. పోలవరంలో భాగమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఇప్పటికి మూడుసార్లు శంకుస్థాపనలు జరిగాయని, అందుకు కీలకమైన ఎడమ కాలువ పనులు 40 శాతమే మాత్రమే పూర్తయ్యాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మిగిలిన పనుల పూర్తికి నాలుగు ప్యాకేజీలు ప్రకటించారని వాటిని ఏడాదిన్నరలో పూర్తిచేసేలా చూస్తామన్నారు. ఆ పనులు పూర్తయితే విశాఖకు గోదావరి నుంచి 24.33 టీఎంసీల నీరు వస్తుందని, పారిశ్రామిక, తాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. అదేవిధంగా నాగావళి, వంశధార లింక్‌ ప్రాజెక్టుపైనా పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో సాంస్కృతిక, వారసత్వ సంపదను కాపాడుతూ వాటిని పరిరక్షించేందుకు అవసరమైన కృషిచేస్తామన్నారు. టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి పనిచేస్తామన్నారు. ఒక చేత్తో బీజేపీ జెండా, మరో చేత్తో ఎన్‌డీఏ ఎజెండా పట్టుకొని జాతీయ వాదంతో ముందుకు వెళతామని మాధవ్‌ ప్రకటించారు. విలేకరుల సమావేశంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 06:21 AM