ఉగ్ర కార్యకలాపాలను అణచివేస్తాం: మాధవ్
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:34 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.
విజయనగరం దాసన్నపేట, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారి ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం వచ్చిన ఆయన పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ... ‘విజయనగరంతో పాటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. నిఘా వ్యవస్థలు మరింత జాగృతితో వ్యవహరించాలి. బోగస్ ఓటర్ల విషయంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే చూపాలి. లేదంటే ఆయన జాతికి క్షమాపణ చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కడప జిల్లాలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో జగన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు చౌకబారు విమర్శలు మానుకోవాలి’ అని మాధవ్ హితవు పలికారు.