BJP President Madhav Rao: ఎన్‌డీఏ అజెండా అమలుకు కృషి
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:12 AM
రాష్ట్రంలో ఎన్‌డీఏ అజెండా పటిష్ట అమలుకు తన వంతు కృషి చేస్తానని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. గురువారం ఆయన కాకినాడ, పిఠాపురంలలో పర్యటించారు.
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం: బీజేపీ చీఫ్ మాధవ్
కాకినాడ, జూలై 10 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో ఎన్‌డీఏ అజెండా పటిష్ట అమలుకు తన వంతు కృషి చేస్తానని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. గురువారం ఆయన కాకినాడ, పిఠాపురంలలో పర్యటించారు. పిఠాపురంలో దత్తాత్రేయస్వామి, పురూహుతికా అమ్మవారు, రాజరాజేశ్వరిదేవి, కుక్కుటేశ్వరస్వామిలను దర్శించుకున్నామన్నారు. కాకినాడకు చెందిన ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కాకినాడలోని పలువురు సీనియర్ నేతలను కలిశారు. బీజేపీ సీనియర్ నేత పైడా భావన ప్రసాద్ ఇంట మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా సనాతన ధర్మంపై స్పష్టంగా గట్టిగా మాట్లాడుతున్న నాయకుడు పవన్‌కల్యాణేనని ఆయన కొనియాడారు. దేశంలోనే ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ‘రాష్ట్రంలో పోలవరానికి సంబంధించి రూ.13వేల కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు, విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్లు ప్యాకేజీ.. ఇలా అనేక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసే విధంగా నిధులు ఇస్తూ కేంద్రప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తోంది. దేశంలో అత్యధిక రోడ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అనేక కొత్త విమానాశ్రయాలు, పోర్టులు, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. 11 ఏళ్ల మోదీ పాలనలో చేసిన అనేక అద్భుత విజయాలను ప్రజల్లోకి తీసుకువెళతాం. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్ కూటమి స్ఫూర్తితో ముందుకు వెళతాం’ అని మాధవ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని బీజేపీ చీఫ్ అన్నారు.