BJP MLA Adinarayan Reddy: జగన్‌కు సూపర్ చెక్
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:32 AM
సూపర్ సిక్స్‌తో సూపర్ హిట్ కొట్టిన కూటమి ప్రభుత్వం వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు సూపర్ చెక్ పెట్టబోతోందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు...
లిక్కర్ కేసులో ఉచ్చు బిగుస్తోంది
వివేకా హత్య కేసులో జగన్మోహన్‌రెడ్డి, భారతి ముద్దాయిలు: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి
అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్‌తో సూపర్ హిట్ కొట్టిన కూటమి ప్రభుత్వం వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు సూపర్ చెక్ పెట్టబోతోందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఎస్‌సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేశ్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జగన్ ధన దాహానికి అడ్డూ అదుపు లేదు. మహా తల్లి భారతి 400 కిలోల బంగారం కొనుగోలు చేశారు. సారాయి అమ్మి, ఇసుక దోచి, మైనింగ్ తవ్వి నేలమాళిగల్లో దాచాడు. రాష్ట్రం సర్వ నాశనం అవ్వాలన్నదే ఆయన ఆలోచన. అధికారంలో ఉన్నప్పుడు ఏది అనుకుంటే అది చేశాడు. ధర్మాన్ని తప్పిన జగన్‌ను జనం ఛీ కొట్టేలా చేస్తాం. చంద్రబాబు అరెస్టు నుంచి ఎన్నెన్నో తప్పులు చేసి, చివరికి చెల్లెళ్ల దగ్గర కూడా చెల్లకుండా పోయాడు. ధర్మ సంస్కృతిని వదిలేసి విష సంస్కృతికి అలవాటు పడ్డాడు. కనకం, రాజరికం తప్ప రాష్ట్రం ఏమై పోయినా జగన్‌కు పట్టదు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పునర్విచారణ జరగాల్సిందే. వాళ్లే చంపి మాపై అన్యాయంగా నింద వేశారు. వైఎస్ జగన్, భారతి ఇందులో ముద్దాయిలు. లిక్కర్ కేసులోనూ జగన్ తప్పించుకోలేరు’’ అని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.