BJP state president Madhav: నాడు మూడు రాజధానులంటూప్రాంతాల మధ్య జగన్ చిచ్చు
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:04 AM
మాజీ సీఎం జగన్ 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధ వ్ ఆరోపించారు....
నేడు మళ్లీ అమరావతేనంటూ మాయ మాటలు
నేడు విశాఖలో ‘సారథ్యం’ ముగింపు సభ
ముఖ్య అతిథిగా జేపీ నడ్డా: మాధవ్
‘ఉక్కు’పై వామపక్షాలు ప్రచారం నమ్మొద్దు
విశాఖపట్నం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధ వ్ ఆరోపించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయం లో శనివారం ఆయన మాట్లాడారు. ‘ఇప్పుడు అదే జగన్ అమరావతే రాజధాని అని, విశాఖపట్నం నుంచి పరిపాలన ఉండదని మళ్లీ మాయమాటలు చెబుతున్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ఎన్‌డీఏ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే దాని గురించి మాట్లాడకుం డా, ప్రైవేటీకరణ చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీతో స్టీల్‌ప్లాంటు తప్పకుండా పురోభివృద్ధి సాధిస్తుంది. స్టీల్ ప్లాంటు పై వామపక్షాలు చేస్తున్న ప్రచారం నమ్మవద్దు. ‘ప్రైవేటీకరణ’ అనే పదా న్ని భూతద్దంలో చూపించి భయపెడుతున్నారు. ఎన్‌డీఏ సారథ్యంలో రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం పనులు శరవేగంతో సాగుతున్నాయి’ అని మాధవ్ తెలిపారు. ‘ప్రధాని మోదీ స్ఫూర్తితో బీజేపీలో ప్రతి కార్యకర్త పనిచేయాలని ‘సారథ్యం’ పేరుతో కడప నుంచి యాత్ర ప్రారంభించాం. ముగింపు సభను విశాఖపట్నం రైల్వే మైదానంలో ఆదివారం నిర్వహిస్తున్నాం.’ అని మాధవ్ తెలిపారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలో పాల్గొనడానికి శనివారం రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు.