PVN Madhav: గూగుల్ కోసం గ్రీన్ ఎనర్జీ
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:56 AM
విశాఖపట్నంలోని గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు పునరుత్పాదక ఇంధనాన్నే ఎక్కువ ఉపయోగిస్తారని, దీని కోసం రూ.21,800 కోట్లతో ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని..
రూ.21,800 కోట్లతో కారిడార్-3 పనులు
పోలవరం ఎడమ కాలువ నుంచి నీటి సరఫరా
భారీ పెట్టుబడి వస్తే జగన్ కనీసం ట్వీట్ చేయలేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ధ్వజం
విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు పునరుత్పాదక ఇంధనాన్నే ఎక్కువ ఉపయోగిస్తారని, దీని కోసం రూ.21,800 కోట్లతో ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్‌పై దుష్ప్రచారాల నేపథ్యంలో వాస్తవాలు వివరించడానికి నగరంలోని గ్రాండ్ బే హోటల్‌లో మంగళవారం పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ డేటా సెంటర్‌కు భూమితో పాటు విద్యుత్, నీరు చాలా ముఖ్యమన్నారు. రాష్ట్రంలో భారీగా సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ అందుబాటులో ఉందని, దానినే గూగుల్ ఉపయోగిస్తుందని.. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా అవసరమైన నీటిని అందిస్తారన్నారు. ఈ నీటిని నిల్వ చేయడానికి స్టీల్‌ప్లాంటు సమీపాన మరో పెద్ద రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఇది కాకుండా సముద్ర నీటిని కూడా శుద్ధి చేసి ఉపయోగిస్తారన్నారు. ‘భారతదేశానికి ఇంత పెద్దఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావడం ఇదే తొలిసారి. దీనిని స్వాగతించాల్సింది పోయి ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ వ్యతిరేక ప్రచారం చేస్తోంది. విశాఖ పారిశ్రామికంగా ఎదగడం వైసీపీకి ఇష్టం లేదా? దీనిపై మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కనీసం ట్వీట్ కూడా చేయలేదు. ఆయన తన వైఖరి ఏమిటో స్పష్టంచేయాలి’ అని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరని అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు.