BJP AP President Madhav: సీఎం చంద్రబాబు పనితీరు అభినందనీయం
ABN , Publish Date - Oct 31 , 2025 | 04:09 AM
మొంథా తుఫాను రాష్ట్రాన్ని కుదిపేసింది. బాధితులకు అండగా నిలవడం, వారికి ధైర్యం, భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ, పనితీరు అభినందనీయం.
వైసీపీ కారణంగానే ఫసల్ బీమా యోజన
రైతులకు అందలేదు: బీజేపీ చీఫ్ మాధవ్
అనంతపురం అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ‘మొంథా తుఫాను రాష్ట్రాన్ని కుదిపేసింది. బాధితులకు అండగా నిలవడం, వారికి ధైర్యం, భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ, పనితీరు అభినందనీయం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తుఫాను విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా నిత్యం ఇక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు మత్స్యకారులకు భృతి అందజేయడాన్ని స్వాగతిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం ప్రీమియం చెల్లించనందుకే అప్పట్లో రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన లబ్ధి అందలేదు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో తుఫాను బాధితులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను అభినందించాల్సింది పోయి విమర్శించడం వైసీపీ దిగజారుడు తనానికి నిదర్శనం. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత, ప్రతిష్ఠకు భంగం కలిగించిన వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పారు’ అని మాధవ్ అన్నారు.