ఢిల్లీ స్కాంను తలదన్నేలా ఏపీ కుంభకోణం: మాధవ్
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:42 AM
ఢిల్లీ మద్యం స్కాంను తలదన్నేలా ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆరోపించారు.
న్యూఢిల్లీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం స్కాంను తలదన్నేలా ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆరోపించారు. ఆప్, బీఆర్‌ఎస్‌లోని కీలక వ్యక్తులు అరెస్టు అయినట్టే, ఈ కుంభకోణంలో భాగస్వాములైన ప్రతిఒక్కరిపైనా చర్యలు ఉంటాయని తెలిపారు. ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తి మిథున్ రెడ్డి అరెస్టును స్వాగతిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవస్థీకృతంగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండాను ఎగరేయడమే లక్ష్యమని, ప్రత్యేకంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 27 నుంచి కడప వేదికగా యాత్రలు ప్రారంభిస్తున్నానని, రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు కొనసాగుతాయని చెప్పారు. అంతకుముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మాధవ్ మర్యాద పూర్వకంగా కలిశారు.