Electricity Department: అటవీశాఖ అడిగితేనే చేస్తున్నాం
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:33 AM
నంద్యాల జిల్లా రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్(బట్టమేక పక్షి)ని రక్షించాలని అటవీశాఖ అధికారులు కోరినందునే తాము బర్డ్ ఫ్లైట్ డైవర్టర్లను ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచామని విద్యుత్ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు.
బర్డ్ ఫ్లైట్ డైవర్టర్ల ఏర్పాటుపై విద్యుత్ శాఖ వివరణ
2022 మార్చి తర్వాత బట్టమేక పక్షి జాడలేదన్న అటవీశాఖ
అయినా దాన్ని రక్షించాలని కోరడం వెనుక మతలబు ఏమిటో?
అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్(బట్టమేక పక్షి)ని రక్షించాలని అటవీశాఖ అధికారులు కోరినందునే తాము బర్డ్ ఫ్లైట్ డైవర్టర్లను ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచామని విద్యుత్ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ‘జాడలేని పక్షి రక్షణ పేరిట రూ.7 కోట్లు భక్షణ’ శీర్షికన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. సుప్రీంకోర్టు సూచనలు.. వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ) సర్వేల ఆధారంగా ఆత్మకూరులోని ప్రాజెక్టు టైగర్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ తమను బర్డ్ ఫ్లైట్ డైవర్టర్లను ఏర్పాటు చేయాలని కోరారని, ఆ మేరకు తాము టెండర్లు పిలిచామని విద్యుత్ శాఖ పేర్కొంది. అయితే డబ్ల్యూఐఐ సర్వేలు నిర్వహించి బట్టమేక పక్షి అంతరించిపోయే దశలో ఉందని, అవి అంతరించిపోవడానికి హైటెన్షన్ తీగలు కారణమని పేర్కొనడం వరకు వాస్తవం. సుప్రీంకోర్టు బట్టమేక పక్షిని రక్షించాలంటూ పేర్కొనడం వాస్తవం. కానీ, అసలు రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీలో బట్టమేక పక్షి జాడ లేదని డబ్ల్యూఐఐ తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని అటు అటవీశాఖ, ఇటు విద్యుత్ శాఖ అధికారులు ఎందుకు విస్మరించారన్న ప్రశ్నకు సమాధానం లేదు. సాక్షాత్తు అటవీశాఖ అధికారుల నివేదికల్లోనే 2022 మార్చి తర్వాత రోళ్లపాడు వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో బట్టమేక పక్షి జాడ లేదని పేర్కొన్న అంశాన్ని మరుగుపర్చి, ఆ పక్షులను రక్షించాలంటూ విద్యుత్‌శాఖ అధికారులకు లేఖ రాయడం వెనుక ఉద్దేశం ఏమిటనేది అంతుచిక్కడం లేదు.
బట్టమేక పక్షి రక్షణ ముసుగులో కోట్లాది రూపాయలు దండుకోవడమే పరమావధిగా అధికారులు డైవర్టర్లను తెరపైకి తెచ్చారన్నది వాస్తవం. పైగా రోళ్లపాడు శాంక్చురీ 6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటే అసలు జాడే లేని పక్షిని రక్షించేందుకు 30 కిలోమీటర్ల వ్యాసార్థం మేరకు ఉన్న హైటెన్షన్ తీగలకు డైవర్టర్లను బిగించడం ఏమిటి? 30 కిలోమీటర్ల వ్యాసార్థం అంటే సుమారు 2828.52 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైటెన్షన్ తీగలకు డైవర్టర్లను బిగిస్తారన్న మాట. అసలు బట్టమేక పక్షి ఉందో లేదో నిర్ధారణ చేయకుండా దాని రక్షణ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.