బిల్లులు అవ్వక అవస్థలు
ABN , Publish Date - Oct 06 , 2025 | 01:13 AM
పంచాయతీల ఖాతాల్లో నిధులు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది. గతంలో కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులను ట్రె జరీలో జమచేస్తే, సీఎఫ్‌ఎంఎస్ ద్వారా బిల్లులు పెట్టుకుని డ్రా చేసుకునేవారు. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి పంచాయతీల ఖాతాల్లో ఉన్న నగదును వినియోగించుకునేందుకు సీఎఫ్‌ఎంఎస్ ద్వారా బిల్లులు పెడితే వాటిని మంజూరు చేయకుండా తిరస్కరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలని చెబుతున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
-2023-24 ఆర్థిక సంవత్సరం ముందు నుంచి ఆగిపోయిన బిల్లులు
- పంచాయతీల్లో 14,15వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నా వాడుకోలేని దుస్థితి
- సీఎఫ్‌ఎంఎస్ ద్వారా పెట్టిన బిల్లులు తిరస్కరణ
- సమస్య పరిష్కరించాలని కార్యదర్శులు, సర్పంచ్‌ల వేడుకోలు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
పంచాయతీల ఖాతాల్లో నిధులు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది. గతంలో కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులను ట్రె జరీలో జమచేస్తే, సీఎఫ్‌ఎంఎస్ ద్వారా బిల్లులు పెట్టుకుని డ్రా చేసుకునేవారు. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి పంచాయతీల ఖాతాల్లో ఉన్న నగదును వినియోగించుకునేందుకు సీఎఫ్‌ఎంఎస్ ద్వారా బిల్లులు పెడితే వాటిని మంజూరు చేయకుండా తిరస్కరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలని చెబుతున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో 474 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి 14, 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసింది. ఈ నిధులు 200లకుపైగా పంచాయతీల్లో రూ.10 వేల నుంచి రూ.40 లక్షల వరకు నగదు జమ అయ్యింది. ఆయా ట్రెజరీల్లో నిల్వ ఉంది. ఈ నగదును వినియోగించుకునేందుకు వివిధ పనులకు సంబంధించిన బిల్లులను పంచాయతీ కార్యదర్శులు సీఎఫ్‌ఎంఎస్ ద్వారా బిల్లులు పెడుతున్నారు. ఈ తరహా బిల్లులు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమ తులు రావాలని ట్రెజరీ అధికారులు నిలిపేస్తున్నారు.
పీఎఫ్‌ఎంఎస్ ద్వారా బిల్లులు పెడితేనే..
పంచాయతీలకు సంబంధించిన ఆర్థిక సంఘం నిధులను గతంలో కేంద్ర ప్రభుత్వం ట్రెజరీలకు జమచేసేది. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి పంచాయతీల బ్యాంకు ఖాతాలకు ఈ తరహా నగదును జమ చేస్తోంది. ఈ నిధులను డ్రా చేసుకునేందుకు సీఎఫ్‌ఎంఎస్‌కు బదులుగా పీఎఫ్‌ఎంఎస్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. పీఎఫ్‌ఎంఎస్ ద్వారా బిల్లులు పెడితే బిల్లులు మంజూరవుతున్నాయని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ముందు 14, 15 ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు విడుదలైన నిధులను మాత్రం వాడుకోకుండా పెండింగ్‌లో పెడుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో వెసులుబాటును ఇచ్చేలా జిల్లాపంచాయతీ కార్యాలయ అధికారులు, కలెక్టర్ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి సమస్యకు పరిష్కారం చూపాలని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు కోరుతున్నారు.