Top CM: బిలియనీర్ చంద్రబాబు
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:13 AM
దేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఆయన కు రూ.931 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయి.
అత్యంత సంపన్న సీఎంల జాబితాలో అగ్రస్థానం
న్యూఢిల్లీ, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): దేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఆయన కు రూ.931 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయి. రూ.332 కోట్లకుపైగా ఆస్తులతో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండు రెండో స్థానంలో, రూ.51 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య మూడో స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రూ.15 లక్షలకుపైగా ఆస్తితో ఈ జాబితాలో చివరిస్థానంలో నిలిచారు. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. 30 మంది సీఎంల సగటు ఆస్తులు రూ.54.42 కోట్లు. వీరి ఆస్తుల మొత్తం రూ.1,632 కోట్లు. వీరిలో ఇద్దరు మాత్రమే బిలియనీర్లు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రూ.30 కోట్ల ఆస్తి, రూ.కోటి అప్పు ఉంది. సంపన్న సీఎంల జాబితాలో ఆయన 7వ స్థానంలో ఉన్నారు. జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు రూ.55 లక్షలు, కేరళ సీఎం పినరయి విజయన్‌కు రూ.కోటి ఆస్తి ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఇక అప్పుల విషయానికి వస్తే పెమా ఖండుకు రూ.180 కోట్లు, సిద్దరామయ్యకు రూ.23 కోట్లు, చంద్రబాబుకు రూ.10 కోట్ల అప్పులు ఉన్నాయి.
బాబు యాజమాన్య స్ఫూర్తిని వెల్లడించిన నివేదిక
చంద్రబాబు 5 దశాబ్దాలుగా చేసిన రాజకీయ ప్రస్థానం ఒకవైపు అయితే, వ్యాపార రంగంలో ఆయన సాధించిన విజయాలు మరో వైపు. 33 ఏళ్ల క్రితం ఎలాంటి ప్రభుత్వ మద్దతు లేకుండా చంద్రబాబు స్థాపించిన డెయిరీ సంస్థ లో ఆయన కుటుంబ సభ్యుల వాటా మూలంగా ఆయన సంపద పెరిగింది. ఎన్నికలలో పోటీ చేసే సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లలో ఆ వివరాలను పేర్కొన్నారని ఏడీఆర్ తెలిపిం ది. హెరిటేజ్ సంస్థలో జీవిత కాలం వాటాదారులు 1,81,907 వరకు ఉన్నారు. ఈ సంస్థ పూర్తిగా డెయిరీ ఉత్పత్తులతో వ్యాపారం చేస్తోందని, మౌలిక సదుపాయాల వంటి ఎలాంటి క్రోనీ క్యాపిటల్ వ్యాపారం చేయలేదని హెరిటేజ్ ఫుడ్స్ అధికారులు తెలిపారు. ఈ సంస్థ స్టాక్ ఎక్స్చేంజ్‌లో స్థానం సంపాదించిన ఎన్నో ఏళ్లకు చంద్రబాబు సీఎం అయ్యారని చెప్పారు. పాల వ్యాపారులకు మార్కెట్ సమస్యలు తీవ్రంగా ఉన్న తరుణంలో ఆయన ఈ వ్యాపారాన్ని చెపట్టారని తెలిపారు. హెరిటేజ్ తన ఉత్పత్తిని 1993లో ప్రారంభించగా, 1994లో ఐపీఓలు విడుదల చేసిందని, 54 రెట్లపైగా వాటాదారులు చేరడంతో దాని వాటాలను బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలలో లిస్టింగ్ చేశారన్నారు. తొలి ఏడాదే హెరిటేజ్ ఫుడ్స్ రూ.1.60 కోట్లతో తొలి పాల చిల్లింగ్ యూనిట్‌ను చిత్తూరులో ప్రారంభించిందన్నారు. 1994లో చంద్రబాబు మంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సి రావడంతో కంపెనీకి రాజీనామా చేశారని, తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం ఆ సంస్థకు ఆమె ఎండీ కాగా, చంద్రబాబు కోడలు, నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. కోవిడ్ తర్వాత అప్పు నుంచి పూర్తిగా బయటపడింది.
హెరిటేజ్ వాటాలే!
చంద్రబాబుకు హెరిటేజ్ ఫుడ్స్‌లో ఎలాంటి షేర్లూ లేనప్పటికీ, 1992లో రూ.7,000 పెయిడప్ పెట్టుబడి, రూ.కోటి అధీకృత పెట్టుబడితో స్థాపించిన ఈ సంస్థలో ఆయన భార్య భువనేశ్వరికి 24.37 శాతం వాటా ఉంది. ఈ వాటాను ఏపీ సీఎం సంపదగా పరిగణించారు. నారా కుటుంబానికి(ప్రమోటర్లు) హెరిటేజ్ ఫుడ్స్‌లో మొత్తం 41.3 శాతం వాటా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1995లో రూ.25 కోట్ల నుంచి తాజాగా రూ.4,381 కోట్లకు(శుక్రవారం షేర్ల ముగింపు ధర ప్రకారం) పెరిగింది.