బిల్లు.. గొల్లు!
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:57 AM
- రామ్‌ప్రసాద్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. ఆయనకు ఇంట్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, స్మార్ట్ టీవీ, ఫ్యాన్ ఉన్నాయి. ఇవి కాకుండా రెండు ట్యూబ్‌లైట్లు ఉన్నాయి. ఆయన మార్చి నెలలో మొత్తం 154 యూనిట్ల విద్యుతను ఉపయోగించారు. దీనికి సంబంధించి వచ్చిన బిల్లు మొత్తం రూ.5,436. ఇందులో రూ.4,550లను పాత బకాయిలుగా చూపించారు. ట్రూ అప్ చార్జీలుగా (33/36) రూ.48.96, ఎఫ్‌పీపీసీఏ చార్జీలుగా(23/05) రూ.93.13, ఎఫ్‌పీపీసీఏ (25/02) చార్జీలుగా రూ.41.60 విధించారు. వినియోగించిన విద్యుత యూనిట్లకు రూ.591, ఫిక్స్‌డ్ చార్జీలుగా రూ.10లు, కస్టమర్ చార్జీలుగా రూ.50, విద్యుత సుంకం రూ.9.24లుగా చూపించారు.

దడ పుట్టిస్తున్న విద్యుత చార్జీలు
154 యూనిట్లు వాడితే రూ.5,436 బిల్లు
మార్చి నెలలో వినియోగదారులకు ‘షాక్’
కొత్తగా అదనపు లోడ్ చార్జీలు
గగ్గోలు పెడుతున్న ప్రజలు
- రామ్‌ప్రసాద్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. ఆయనకు ఇంట్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, స్మార్ట్ టీవీ, ఫ్యాన్ ఉన్నాయి. ఇవి కాకుండా రెండు ట్యూబ్‌లైట్లు ఉన్నాయి. ఆయన మార్చి నెలలో మొత్తం 154 యూనిట్ల విద్యుతను ఉపయోగించారు. దీనికి సంబంధించి వచ్చిన బిల్లు మొత్తం రూ.5,436. ఇందులో రూ.4,550లను పాత బకాయిలుగా చూపించారు. ట్రూ అప్ చార్జీలుగా (33/36) రూ.48.96, ఎఫ్‌పీపీసీఏ చార్జీలుగా(23/05) రూ.93.13, ఎఫ్‌పీపీసీఏ (25/02) చార్జీలుగా రూ.41.60 విధించారు. వినియోగించిన విద్యుత యూనిట్లకు రూ.591, ఫిక్స్‌డ్ చార్జీలుగా రూ.10లు, కస్టమర్ చార్జీలుగా రూ.50, విద్యుత సుంకం రూ.9.24లుగా చూపించారు. -గుణదలకు చెందిన ఓ వినియోగదారుడు 284 యూనిట్లను వినియోగించాడు. ఆయనకు వచ్చిన మొత్తం బిల్లు రూ.1,533.25. ఈ విద్యుత బిల్లులను చూసి వినియోగదారులు గొల్లుమంటున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఇంట్లో స్విచ్ వేసినా, వేయకపోయినా కరెంట్ షాక్ తగులుతోంది. వినియోగించిన విద్యుత మూరెడు ఉంటే, వచ్చే బిల్లులు మాత్రం బారెడు ఉంటున్నాయి. కిందటి నెల వందల్లో వచ్చిన విద్యుత బిల్లులు ఇప్పుడు ఒక్కసారిగా వేలల్లోకి వెళ్లాయి. ట్రూప్ అప్ చార్జీలు, ఇంధనపు చార్జీలు, సర్దుబాటు చార్జీలతోపాటు అదనపు లోడ్ చార్జీలను విధిస్తున్నారు. దీనితో వినియోగదారులకు ఈ నెలలో చెల్లించాల్సిన బిల్లులు డబుల్ షాక్‌ను ఇస్తున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో విధిస్తున్న చార్జీలతో విద్యుత వినియోగదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికి అదనపు లోడ్ చార్జీలను జోడించడంతో తలలు పట్టుకుంటున్నారు. ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నారు. ఇళ్లలో ఫ్యాన్‌లు వేయాలన్నా, ఏసీ ఆన్ చేయాలన్నా వినియోగదారులు బెంబేలెత్తి పోతున్నారు. గత నెలకు, ఈ నెలకు బిల్లులు తడిసి మోపిడయ్యాయి. ట్రూ అప్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు, ఫిక్స్‌డ్ చార్జీలు, కస్టమర్ చార్జీల పేరుతో బిల్లులు పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. గత నెలకంటే చార్జీలు రెట్టింపు కావడంతో వినియోగదారులు విద్యుత శాఖ అధికారులపై మండిపడుతున్నారు. కరెంటు చార్జీలు పెంచబోమని ప్రభుత్వం చెబుతుంటే బిల్లులు మోత మోగించడం ఏమిటని వినియోగదారులు నిలదీస్తున్నారు. రెట్టింపు బిల్లులు వచ్చాయని వారు ఆందోళన చెందుతున్నారు.
పాత బకాయిలుగా అదనపు లోడ్ చార్జీలు
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎల్‌టీ - 1(గృహ) కనెక్షన్లు 14,98,644, ఎల్‌టీ - 2(వాణిజ్యం) కనెక్షన్లు 1,19,874 ఉన్నాయి. ఇవి కాకుండా ఎల్‌టీ - 3(పరిశ్రమలు) కనెక్షన్లు 7,198, ఎల్‌టీ - 4(కుటీర పరిశ్రమలు) కనెక్షన్లు 27,786, ఎల్‌టీ - 5 (ఆక్వా) 3 వేలు, హెచ్‌టీ కనెక్షన్లు 1,522 ఉన్నాయి. ఈ మొత్తం కనెక్షన్లకు ఏడు రకాలుగా చార్జీలను విధిస్తున్నారు. వీటితోపాటు అదనపు లోడ్ చార్జీలను బిల్లులో విధిస్తున్నారు. విద్యుత కనెక్షన్ తీసుకునేటప్పుడు ఎంత వరకు లోడ్ వినియోగిస్తారో దరఖాస్తులో తెలియజేయాల్సి ఉంటుంది. కొద్దినెలల క్రితం విద్యుత శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి లోడ్‌ను తనిఖీ చేశారు. దరఖాస్తులో పేర్కొన్న లోడ్‌కు మించి విద్యుతను వినియోగిస్తున్నారని నోటీసులు జారీ చేశారు. ఎంత లోడ్ అదనంగా వినియోగిస్తున్నారో దానికి చెల్లించాల్సిన మొత్తాలను రాసి ఇచ్చారు. ఈ నోటీసులకు వినియోగదారులు పెద్దగా స్పందించలేదు. దీనితో బిల్లులో వాటిని చూపిస్తున్నారు. వాటిని పాత బకాయిలుగా బిల్లులో పేర్కొన్నారు. ఆ బకాయిలను పదో తేదీ లోగా చెల్లించాలని విద్యుత శాఖ సిబ్బంది చెబుతున్నారు. వినియోగదారులు విద్యుత కార్యాలయాలకు వెళ్లి సందేహాలను వ్యక్తం చేసిన తర్వాత ఈ విషయాన్ని చెబుతుండడం గమనార్హం.
నోటీసులు ఎప్పుడిచ్చారో తెలియదు :
నేను అద్దె ఇంట్లో ఉంటున్నా. ప్రతినెలా బిల్లు చెల్లిస్తున్నా. నాకు ఈ నెల బిల్లు రూ.591 వచ్చింది. ఎరియర్స్(పాత బకాయిలు)గా రూ.4,550 చూపించారు. బిల్లు ఇవ్వగానే సంబంధిత విద్యుత కార్యాలయానికి వెళ్లా. ఇదేమిటని అడిగితే అదనపు లోడ్ చార్జీలని చెప్పారు. వాటిని పదో తేదీ లోగా చెల్లించాలని చెబుతున్నారు. లేకపోతే ఈ చార్జీలు ఇంకా పెరుగుతాయని అధికారులు అంటున్నారు. ఇదెక్కడి దారుణమో అర్థం కావడం లేదు. ఇప్పటికే ట్రూ అప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలతో మాపై భారం పడుతుంది.