Share News

TTD EX Chairman Bhumana Karunakar: నైలు నదిలో మొసళ్లెన్ని

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:13 AM

పరకామణి చోరీ కేసులో టీటీడీ బోర్డు మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు.

TTD EX Chairman Bhumana Karunakar: నైలు నదిలో మొసళ్లెన్ని

  • నిన్న కురిసిన వానలో ఎన్ని చినుకులు?

  • ఇలాంటి ప్రశ్నలకు ఏం చెబుతాం...

  • పరకామణి చోరీ కేసులోనూ ఇదే చెప్పా

  • సీఐడీ విచారణ తర్వాత భూమన వ్యంగ్యం

  • అరగంటలో ముగిసిన విచారణ

  • రాజీ గురించి తెలియదని వెల్లడి

తిరుపతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పరకామణి చోరీ కేసులో టీటీడీ బోర్డు మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. అరగంటలో ముగిసిన విచారణ అనంతరం బయటికి వచ్చారు. లోపల ఏం సమాధానాలు చెప్పారో తెలియదుగానీ... విచారణకు ముందు, బయటికి వచ్చాక మాత్రం మీడియా ముందు తనలోని వ్యంగ్యమంతా ప్రదర్శించారు. ‘‘ఒత్తిడి భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను పిలిచారు. అయిననూ... పోయిరావలె హస్తినకు’’ అంటూ లోపలికి వెళ్లారు. తిరిగి బయటికి వచ్చాక మళ్లీ మీడియాతో మాట్లాడుతూ... ‘‘పసిఫిక్‌ మహా సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నాయి? నైలు నదిలో మొసళ్ల సంఖ్య ఎంత? 1500 ఏళ్లుగా వెంకన్నకు తలనీలాలు ఇచ్చిన వారు ఎంతమంది? నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని? అని అడిగితే ఏమి సమాధానం చెప్పగలనో... పరకామణి కేసులో అంతే సమాధానం చెప్పాను’’అని అన్నారు. పరకామణి చోరీ కేసులో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి పద్మావతి అతిథిగృహంలో సీఐడీ డీజీ ఎదుట భూమన విచారణకు హాజరయ్యారు. మాజీ ఏవీఎస్వో సతీశ్‌ కుమార్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందగానే మీరు ఆత్మహత్య అని ఎలా చెప్పారు? అని భూమనను సీఐడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. నగదు చోరీకి సంబంధించిన కేసు రాజీ చేస్తుంటే టీటీడీ ఛైర్మన్‌గా ఏం చేస్తున్నారు? నిందితుడి ఆస్తులు టీటీడీకి రాయించుకోవాలని టేబుల్‌ అజెండాలో ఎవరు పెట్టారు? ఎస్టేట్‌ కమిటీలో సభ్యుడిగా అత్యవసర తీర్మానం చేసిందెవరు? రాజీ ప్రతిపాదన ఎవరు తెచ్చారు? వంటి ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది.


సతీశ్‌ కుమార్‌ది ముమ్మాటికి ఆత్మహత్యేనని, ప్రభుత్వ ఒత్తిడితోనే చనిపోయాడన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని భూమన చెప్పినట్టు తెలిసింది. ‘‘చోరీ కేసులో రాజీకి ముందు, వెనుక ఏం జరిగిందో నాకేమీ తెలియదు. టేబుల్‌ అజెండాలో అందరూ పెట్టినట్టే నేను కూడా సంతకం పెట్టాను. ఈవోకు తెలియకుండా ఎలా జరుగుతుంది? నాకు సంబంధం లేని ప్రశ్నలు వేస్తే ఎలా?’’ అని భూమన ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదే కేసులో టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్‌ కుమార్‌ను కూడా సీఐడీ బృందం మంగళవారం విచారించింది. ఎస్టేట్‌ కమిటీలో సభ్యుడిగా పరకామణి ఎపిసోడ్‌లో రాజీ ఎలా జరిగిందని ప్రశ్నించినట్టు తెలిసింది. మరో ఎస్టేట్‌ కమిటీ సభ్యుడు జీవన్‌ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - Nov 26 , 2025 | 04:16 AM