కాళరాత్రి ఆలంకరణలో భ్రామరి
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:56 PM
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా ఉత్సవాలు సందడిగా జరుగుతున్నాయి.
శ్రీగిరిపై ఆది దంపతులకు గజ వాహనసేవ
శ్రీశైలం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా ఉత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు ఆదివారం భ్రమరాంబికా దేవి భక్తులకు కాళరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారిని అక్కమహాదేవి అలంకార మండపంలో విశేష పుష్పాలతో అలంకరణ చేశారు. ఈ దేవి నల్లటి దేహఛాయతో జుట్టు విరబోసుకుని రౌద్రరూపంలో కనిపించారు. ఈ అలంకరనలో అమ్మవారు నాలుగు చేతులను కలిగి ఉంటారు. కుడివైపున అభయహస్తం, వరద ముద్రను, ఎడమవైపు ఖడ్గము, లోహకంటకాన్ని ధరించారు. కాళరాత్రి స్వరూపం చూడటానికి రౌద్రంగా ఉన్నప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ఇస్తారు. అందుకే ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.
గజవాహనంపై ఆది దంపతులు : వాహనసేవలో భాగంగా సాయంత్రం భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామివారు ప్రత్యేక అలంకరణలో గజవాహనంపై విహరించారు. అక్కమహదేవి అలంకార మండపం నుంచి ఆలయ రాజగోపురం మీదుగా గంగాధర మండపం, నందిగుడి క్షేత్ర ప్రాంతాల్లో గ్రామోత్సవం కొనసాగింది. గ్రామోత్సవంలో ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావు, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. గ్రామోత్సవం ఎదుట సాంస్కృతిక కళారూపాలు, వివిధ వేషధారణలు, సంగీత వాయిద్యాలతో కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. నిత్య కళారాధన వేదికలో విజయవాడకు చెందిన గాయత్రీ నృత్యానికేతన బృందం సంప్రదాయ నృత్యం ప్రదర్శించగా, వి.కృష్ణకుమార్ బృందం సంగీత విభావరి భక్తులను ఆకట్టుకుంది.
నేడు మహాగౌరి అలంకరణ: దసరా ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం నాడు అమ్మవారు మహాగౌరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రికి ఆది దంపతులు నందివాహనంపై విహరిస్తారు.