Share News

Tirumala Prasadam: భోలేబాబా మాయ

ABN , Publish Date - Nov 11 , 2025 | 04:22 AM

కల్తీ నెయ్యి గుట్టు వీడుతోంది. పరమ పవిత్రమైన తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి యథేచ్ఛగా వాడినట్లు సీబీఐ భాగస్వామిగా ఉన్న సిట్‌ తేల్చింది.

Tirumala Prasadam: భోలేబాబా మాయ

  • పాలు లేవు.. వెన్న తియ్యలేదు

  • టన్నులకొద్దీ కల్తీ నెయ్యి తయార్‌

  • పామాయిల్‌, రసాయనాలతో ‘నెయ్యి’

  • తిరుమల ప్రసాదాలకు అదే సరఫరా

  • ఏఆర్‌, శ్రీవైష్ణవీ డెయిరీలకూ అదే సరుకు

  • అక్కడి నుంచి టీటీడీకి పంపిన సంస్థలు

  • ‘సుగంధ్‌ ఆయిల్స్‌’ యజమాని అరెస్టుతో కీలక విషయాలు

  • రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించిన ‘సిట్‌’

  • అయినా ఆగని జగన్‌ మీడియా బొంకులు

(అమరావతి/తిరుపతి - ఆంధ్రజ్యోతి)

కల్తీ నెయ్యి గుట్టు వీడుతోంది. పరమ పవిత్రమైన తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి యథేచ్ఛగా వాడినట్లు సీబీఐ భాగస్వామిగా ఉన్న ‘సిట్‌’ తేల్చింది. జగన్‌ ప్రభుత్వ హయాంలో పామోలిన్‌ నూనెలో రసాయనాలు కలిపేసి తయారు చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేసినట్లు నిర్ధారణ అయ్యింది. కల్తీ నెయ్యి కేసును దర్యాప్తు చేస్తున్న ‘సిట్‌’... కీలక నిందితుడు అజయ్‌ కుమార్‌ సుగంధ్‌ (ఏ16)ను అరెస్టు చేసింది. సోమవారం నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరిచింది. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో అనేక కీలక అంశాలను పొందుపరిచింది. దీని ప్రకారం... జగన్‌ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ)ఆవు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్‌లో భారీ గోల్‌మాల్‌లు జరిగాయి. సొంతంగా డెయిరీ ఉండి, పాలసేకరణ, నెయ్యి, వెన్న తయారీలో సుదీర్ఘ అనుభవమున్న కంపెనీలకు మాత్రమే ఈ టెండర్‌లో పాల్గొనే అర్హత ఉంటుంది. కానీ... జగన్‌ సర్కారు కాలంలో ఇవేవీ పట్టించుకోలేదు. శ్రీవైష్ణవీ డెయిరీ (పెనుబాక), ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ (దిండుగల్‌)తో పాటు పలు సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ కూడా ఈ జాబితాలో ఉంది. విచిత్రమేమిటంటే... భోలేబాబా డెయిరీ ఒక్క పాల చుక్క కూడా సేకరించలేదు. వెన్నా తియ్యలేదు. అయినా... టన్నుల కొద్దీ నెయ్యిని తయారు చేసింది. టీటీడీకి సరఫరా చేసింది. అంతేకాదు... ఇదే కేసులో కుట్రదారులైన ఏఆర్‌ డెయిరీ, శ్రీవైష్ణవీ డెయిరీ తదితర సంస్థలూ భోలేబాబా నుంచి వచ్చిన కల్తీ నెయ్యినే టీటీడీకి పంపించాయి.


అంతా కల్తీ...

యూపీలోని భగవాన్‌పూర్‌లో ఉన్న భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ యజమానులే... అక్కడికి సమీపంలో ‘హర్ష్‌ ఫ్రెష్‌’ పేరుతో మరో డెయిరీ ఏర్పాటు చేశారు. పోనీ... ఆ సంస్థైనా పాలు సేకరించిందా అంటే అదీలేదు. అది చేసిన పనల్లా పాలకు బదులు పామోలిన్‌ ఆయిల్‌, పామ్‌ కెర్నెల్‌ ఆయిల్‌, ఇతర రసాయనాలను సేకరించడమే! ఢిల్లీ కేంద్రంగా ఉన్న బడ్జెస్‌ అండ్‌ బడ్జెస్‌ అనే కంపెనీతోపాటు... అజయ్‌ కుమార్‌ సుగంధ్‌కు చెందిన ‘సుగంధ్‌ ఆయిల్స్‌ అండ్‌ కెమికల్స్‌’, ఇతర సంస్థల నుంచి వీటిని కొనుగోలు చేశారు. మోనో గ్లిసరైడ్స్‌, ఎసిటిక్‌ యాసిడ్‌ ఈస్టర్‌, ల్యాక్టిక్‌ యాసిడ్‌, కృత్రిమంగా నెయ్యి వాసన తెప్పించే రసాయనాలు (ఘీ ఎసెన్స్‌) వంటివి ఢిల్లీ నుంచి తొలుత హర్ష్‌ ఫ్రెష్‌ డైరీకి చేరాయి. అక్కడి నుంచి... భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీకి తరలించారు. వీటిని కలిపేసి కల్తీ నెయ్యిని తయారు చేసి... టీటీడీకి నిరాటంకంగా సరఫరా చేశారు. టీటీడీ అంచనా ప్రకారం... ఏకంగా 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని భోలేబాబా డెయిరీ తయారు చేసింది. ఈ కల్తీ నెయ్యి విలువ నికరంగా రూ.250 కోట్లు! ఇందులో 137 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల కల్తీ నెయ్యిని భోలే బాబా సంస్థ శ్రీ వైష్ణవీ డెయిరీ స్పెషాలిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏ6)కు పంపింది. అదే నెయ్యిని శ్రీ వైష్ణవీ డెయిరీ టీటీడీకి సరఫరా చేసింది. భోలేబాబా ఫక్తు కల్తీ నెయ్యిని తయారు చేయగా... అక్కడి నుంచి వచ్చిన అదే కల్తీ నెయ్యిని శ్రీవైష్ణవీ డెయిరీ, ఏఆర్‌ డెయిరీ ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏ1)లు టీటీడీకి పంపించాయి. ఆ కల్తీ నెయ్యినే పవిత్రమైన శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించారు.


నాడు కుట్ర అని గగ్గోలు

జగన్‌ హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు 2024 సెప్టెంబరులోనే కూటమి ప్రభుత్వం చెప్పింది. దీంతో... అప్పుడే వైసీపీ ‘రివర్స్‌ డ్రామా’ మొదలుపెట్టింది. చంద్రబాబు దేవుడితో రాజకీయాలు ఆడుతున్నారని, జగన్‌ను పావుగా చే యాలనుకుంటున్నారని వైసీపీ నేతలు, వారి అనుకూల నీలి మీడియా గగ్గోలు పెట్టింది. నాడు కూటమి ప్రభుత్వం చెప్పింది నిజమని ఇప్పుడు రుజువైంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోఈ కేసును దర్యాప్తు చేస్తున్న... సీబీఐ భాగస్వామిగా ఉన్న ‘సిట్‌’ ఈ సంగతి తేల్చింది. దీంతో... నిజాన్ని ఒప్పుకోలేక, సీబీఐని విమర్శించలేక మళ్లీ రాజకీయ కుట్రలు అంటూ జగన్‌ రోత మీడియా రకరకాల విన్యాసాలు చేస్తోంది. సోమవారం గంటల కొద్దీ డ్రామాలు నడిపింది. నిజానికి... కల్తీ నెయ్యి గుట్టును రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోలీసులే నిగ్గు తేల్చారు. అయితే... అప్పటి ‘సిట్‌’ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అని, ఆయన కోరుకున్నట్లుగానే విచారణ నివేదిక ఉంటుందని తప్పుడు ప్రచా రం చేశారు. దీనిపై సుప్రీం కోర్టుదాకా వెళ్లారు. దీంతో... రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లో సీబీఐని కూడా భాగస్వామిని చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదేదో సీఎంకు, కూటమి ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బలా జగన్‌ మీడియా రచ్చ చేసింది. ‘‘టీటీడీకి పంపిన నెయ్యిలో కల్తీ జరిగిందా... లేదా? లడ్డూ తయారీలో కల్తీనెయ్యి వాడారా... లేదా?’’ అనే రెండు మౌలిక ప్రశ్నలపై సిట్‌ దృష్టి సారించింది. జగన్‌ బాబాయ్‌, నాటి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తీరు కూడా అనుమానాస్పదమే అని సీబీఐ భాగస్వామిగా ఉన్న ‘సిట్‌’ తేల్చింది. ఆయన పీఏగా వ్యవహరించిన చిన్న అప్పన్న నేరుగా రంగంలోకి దిగి... భోలేబాబాతో ‘డీల్స్‌’ మాట్లాడినట్లు కూడా తేలింది. వివరాలన్నింటినీ ‘సిట్‌’ స్వయంగా కోర్టుకు సమర్పించింది. ఆ విషయాలను జగన్‌ రోత మీడియా దాచిపె ట్టి... వాస్తవాలకు వక్రీకరణలు జోడిస్తూ వచ్చింది. ఇప్పుడు ఏ16 అజయ్‌ కుమార్‌ సుగంధ్‌ అరెస్టుతో మరిన్ని సంచలన నిజాలు బయటకొచ్చాయి. నెల్లూరు కోర్టు ముందుకు ఏ16 రిమాండ్‌ రిపోర్టు రాకముందే... ‘అసలు కల్తీ నెయ్యే లేదు’’ అని రోత మీడియాలో సీరియల్‌ నడిపారు. రిమాండ్‌ రిపో ర్టు వెలుగులోకి వచ్చాక... ‘నెయ్యిలో కల్తీ జరిగింది కానీ, దానిని తిరుమలలో వాడలేదు’ అంటూ నాలుక మడతేశారు.


ఎవరీ అజయ్‌ కుమార్‌?

కల్తీ నెయ్యి కేసులో ఏ16... అజయ్‌ కుమార్‌ సుగంధ్‌! ఢిల్లీకి చెందిన ‘సుగంధ్‌ ఆయిల్స్‌ అండ్‌ కెమికల్స్‌’ యజమాని. భోలేబాబా యజమానులతో అజయ్‌ కుమార్‌ కుమ్మక్కై... కల్తీ నెయ్యి తయారీకి అవసరమైన రసాయనాలను సరఫరా చేశారు. ఢిల్లీలోని ‘సుగంధ్‌ కెమికల్స్‌’ గోదాముల్లో ‘సిట్‌’ అధికారులు తనిఖీలు జరిపారు. కొరాయి నుంచి దిగుమతి చేసుకున్న మోనో గ్లిజరైడ్‌ను, ఇతర రసాయనాలను గుర్తించారు. ఎలాంటి లేబుల్స్‌లేని నీలిరంగు డ్రమ్ముల్లో (200 కిలోల చొప్పున) నింపి... సరఫరా చేశారు. 2022-23 నుంచే ఈ లావాదేవీలు జరిగాయి. సుగంధ్‌ ఆయిల్‌ అండ్‌ కెమికల్స్‌ నుంచి తమకు సరఫరాలు జరిగినట్లు భోలేబాబా డెయిరీ ఉద్యోగులు కూడా అంగీకరించారు. పామాయిల్‌, కొబ్బరినూనె, కెర్నల్‌ ఆయిల్‌ పేరుతో ఇన్వాయి్‌సలు సృష్టించి... రసాయనాలు పంపినట్లు తేలింది. అయితే... అజయ్‌ కుమార్‌ సుగంధ్‌ను ఈనెల 7న సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. విచారణలో ఆయన తమకు సహకరించలేదని... మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఎలక్ట్రానిక్ పరికరాలు పరిశీలించేందుకు అంగీకరించలేదని సిట్‌ వెల్లడించింది.

Updated Date - Nov 11 , 2025 | 04:24 AM