Ram Mohan Naidu: జూన్‌కంటే ముందే భోగాపురం విమానాశ్రయం
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:52 AM
వచ్చే జూన్‌లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించాలనుకున్నాం. అయితే ఇంకా నెల రోజుల ముందే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు చెప్పారు.
ప్రపంచ ఏవియేషన్ అవసరాలు తీర్చేదిశగా ఎడ్యుసిటీ నిపుణులు
ఉద్యోగాల కల్పనకు ఇది ఉపయుక్తం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘వచ్చే జూన్‌లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించాలనుకున్నాం. అయితే ఇంకా నెల రోజుల ముందే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది’ అని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు చెప్పారు. విశాఖపట్నం రాడీసన్ బ్లూ హోటల్‌లో జీఎంఆర్-మాన్సాస్ సంస్థల మధ్య మంగళవారం జరిగిన ఎడ్యుసిటీ ఒప్పంద కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఏవియేషన్ అనేది ఫ్యూచరిస్టిక్ అంశం. సీఎం చంద్రబాబు తన విజన్‌తో ఎడ్యుసిటీని ప్లాన్ చేశారు. ఇక్కడ తయారయ్యే నిపుణులు డొమెస్టిక్ రంగంలోనే కాకుండా ప్రపంచ ఏవియేషన్ అవసరాలు తీర్చే స్థాయికి ఎదుగుతారు. అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇకపై వలసలు వెళ్లే అవసరం ఉండదు. ఇతర దేశాల వారే ఇక్కడికి వలస వస్తారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా యూనివర్సిటీలు కూడా ఇక్కడికే వస్తాయి. ఏవియేషన్ ఒక వర్గానికి చెందినది కాదు. ఇప్పుడు ఇది అందరికీ అవసరమైనది. ప్రస్తుతం దేశంలో 800 విమానాలు ఉన్నాయి. మరో 1,700 విమానాలకు ఆర్డర్ పెట్టారు. ప్రతి విమానానికి వంద మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆ ఉద్యోగాల కల్పనకు ఎడ్యుసిటీ ఉపయోగపడుతుంది. గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు గతంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏటా 12 శాతం వృద్ధి రేటుతో విమాన రంగం ముందుకు వెళుతోంది. ఇప్పుడు ఉత్తరాంధ్రకు, రేపటి తరం చూడబోయే ఉత్తరాంధ్రకు చాలా తేడా ఉంటుంది’ అని రామ్మోహన్ నాయుడు అన్నారు.