Bhimavaram: రైలులో విద్యార్థినిపై టీటీఈ వేధింపులు
ABN , Publish Date - Oct 25 , 2025 | 05:40 AM
నా పక్కన కూర్చో.. రిజర్వేషన్ బెర్త్ ఇస్తా.. చల్లగా ఏసీలో ఉండు.. నాకు సహకరిస్తే సాయం చేస్తా.. అని ఓ రైల్వే ఉద్యోగి ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భీమవరంలో కేసు.. ఆలస్యంగా వెలుగులోకి..
భీమవరం క్రైం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘నా పక్కన కూర్చో.. రిజర్వేషన్ బెర్త్ ఇస్తా.. చల్లగా ఏసీలో ఉండు.. నాకు సహకరిస్తే సాయం చేస్తా..’ అని ఓ రైల్వే ఉద్యోగి ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం కథనం ప్రకారం.. ఓ విద్యార్థిని ఈనెల 8న నరసాపురం నుంచి ధర్మవరం వెళ్లే ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. రిజర్వేషన్ లేకపోవడంతో టీటీఈ అభిజిత్ కుమార్(బిహార్‌కు చెందిన వ్యక్తి)ను బెర్త్ కావాలని కోరింది. ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అభిజిత్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిస్సహాయ స్థితిలో మిన్నకుండిపోయిన ఆమె, తర్వాత తోటి ప్రయాణికుల సాయంతో విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును భీమవరం రైల్వే పోలీసులకు పంపించడంతో అభిజిత్‌పై ఇక్కడ కేసు నమోదు చేశారు. రైల్వే ఉన్నతాధికారులు వెంటనే అతడిని సస్పెండ్ చేశారు.