DSP Transfer: భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:51 AM
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్‌జీ జయసూర్యపై బదిలీ వేటు పడింది. ఆయనకు ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు
హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశం
వివాదాల్లో తలదూరుస్తున్నారని ఆరోపణలు
పవన్ కల్యాణ్‌కు బాధితుల ఫిర్యాదులు
వాటిపై ఎస్పీతో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి
ప్రభుత్వ ఆదేశాలతో ఎస్పీ విచారణ
కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణు నియామకం
భీమవరం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్‌జీ జయసూర్యపై బదిలీ వేటు పడింది. ఆయనకు ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. మంగళగిరిలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఆదేశాలు జారీచేశారు. జయసూర్య స్థానంలో భీమవరం డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమించారు. జయసూర్యను ప్రత్యేకంగా బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి ఆయన వ్యవహార శైలి వివాదాస్పదమైంది. సెటిల్‌మెంట్లలో తలదూర్చారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో కొందరు బాధితులు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. వాటిపై ఆయన తక్షణమే స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీమ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. హోం మంత్రి అనిత, డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్లడంతో ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్పీని ఆదేశించింది. ఆయన బాధితులను రప్పించి విచారించారు. ఇదే సమయంలో.. జయసూర్య డీఎస్పీ విధుల్లో ఉండగానే ఫిర్యాదులపై విచారణ చేస్తే వాస్తవాలు ఎలా చెప్పగలరన్న వాదన వినిపించింది. ఇటీవల జయసూర్య కాలికి గాయమైంది. కొద్ది రోజుల క్రితం సెలవు పెట్టారు. గడచిన 20 రోజుల నుంచి సెలవులోనే ఉన్నారు.
సెటిల్‌మెంట్లే ముంచాయా?
సివిల్ తగాదాల్లో తలదూర్చడం, పేకాటలో తలెత్తిన వివాదంలోనూ సెటిల్‌మెంట్లు నిర్వహించారన్న ఫిర్యాదులు డీఎస్పీ జయసూర్యపై అధికమయ్యాయి. పవన్ కల్యాణ్‌కు వీటిపైనే ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వం విచారణకు ఆదేశించిన తరుణంలోనే డీఎస్పీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మద్దతు పలికారు. మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. పవన్ కల్యాణ్ అన్ని శాఖల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే విచారణ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇవన్నీ అప్పట్లో జిల్లాలో సంచలనం రేకెత్తించాయి. అయితే విచారణ వివరాలు బయటకు పొక్కకుండా పోలీసు అధికారులు గోప్యత పాటించారు. జయసూర్యపై ఫిర్యాదులు, విచారణ అంతా సద్దుమణిగిపోయిందనుకున్న తరుణంలో ప్రభుత్వం ఆకస్మికంగా ఆయనపై బదిలీ వేటు వేయడం గమనార్హం.