Bhavani Deeksha: నేటి నుంచి భవానీ దీక్షల విరమణలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:35 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై గురువారం నుంచి భవానీ దీక్షల విరమణలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది....
విజయవాడ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై గురువారం నుంచి భవానీ దీక్షల విరమణలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. గురువారం ఉదయం 6.30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిసా రాష్ట్రాల నుంచి సుమారు 5-6 లక్షల మంది భవానీ దీక్షాధారులు ఇంద్రకీలాద్రికి వస్తారని అంచనా వేశారు. భవానీల కోసం కనకదుర్గ నగర్‌లో మూడు హోమగుండాలు ఏర్పాటు చేశారు. కుమ్మరిపాలెం వైపున ఒక హోల్డింగ్ పాయింట్, వీఎంసీ వద్ద రెండు హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా భక్తులను క్యూలైన్లలోకి పంపుతారు. కనకదుర్గ నగర్‌లో 13 ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేశారు. వారిలో రెండు కౌంటర్లను విభిన్న ప్రతిభావంతులకు కేటాయించారు. ప్రతిరోజూ అమ్మవారికి నాలుగుసార్లు నివేదన, సాయంత్రం ఆరు గంటలకు హారతులు ఇస్తారు. ఈ సమయాల్లో దర్శనాన్ని నిలుపుదల చేస్తారు. భవానీ దీక్షల విరమణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 4,123 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా కోసం 312 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు.