Share News

Vijayawada: భాస్కర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

ABN , Publish Date - Nov 08 , 2025 | 06:35 AM

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కుటుంబసభ్యులు, మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ తదితరులపై...

Vijayawada: భాస్కర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

  • నెల్లూరు జైలుకు తరలింపు

  • అతని సోదరుడు ఓబుల్‌ రెడ్డిపైనా కేసు

  • భాస్కర్‌రెడ్డి అరెస్టు సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్‌పై దౌర్జన్యం

  • కోర్టుకు హాజరు.. రిమాండ్‌ విధింపు

విజయవాడ/పెనమలూరు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కుటుంబసభ్యులు, మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ తదితరులపై సోషల్‌ మీడియా అనుచిత పోస్టుల కేసులో అరెస్టయిన మాలపాటి భాస్కర్‌రెడ్డిని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 10 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి ఆయనకు ఈనెల 21వ తేదీ వరకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం పోలీసులు భాస్కర్‌రెడ్డిని నెల్లూరు జైలుకు తరలించారు. గురువారం భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు.. స్థానిక స్టేషన్లో కాకుండా మరో చోట విచారించారు. తర్వాత పెనమలూరు స్టేషనుకు తరలించి ఎఫ్‌ఐఆర్‌ను పూర్తి చేశారు. రిమాండ్‌ నిమిత్తం శుక్రవారం మధ్యాహ్నం ఎస్కార్టు మధ్య విజయవాడ కోర్టుకు తీసుకెళ్లారు.


అవనిగడ్డ జైలుకు భాస్కర్‌రెడ్డి సోదరుడు

కానూరు వంద అడుగుల రోడ్డులోని కామినేని ఆస్పత్రి వద్ద భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొన్న సమయంలో భాస్కర్‌రెడ్డితో పాటు ఉన్న అతని సోదరుడు ఓబుల్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వారి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఓ మహిళా పోలీసుపై చేయిచేసుకున్నాడు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఓబుల్‌రెడ్డిని విజయవాడలోని ఆరవ అదనపు ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ర్టేట్‌ ముందు హాజరుపరచగా.. అతనికి జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. అనంతరం పోలీసులు ఆయన్ను అవనిగడ్డ సబ్‌జైలుకు తరలించారు.

Updated Date - Nov 08 , 2025 | 06:39 AM