Share News

రూ.500 కోట్లతో బెజవాడ అభివృద్ధి!

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:40 AM

విజయవాడ నగరాభివృద్ధికి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పెద్దన్నలా నేనున్నానంటోంది. రూ.500 కోట్ల వ్యయంతో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సిద్ధమైంది. ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న స్ర్టామ్‌ వాటర్‌(వర్షపు నీటి) డ్రెయిన్ల నిర్మాణానికి చర్యలు తీసుకోనుంది. ఆటోనగర్‌తో ముడిపడిన ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.

రూ.500 కోట్లతో బెజవాడ అభివృద్ధి!

- భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్‌డీఏ రెడీ

- రూ.150 కోట్ల వ్యయంతో స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్లు

- రూ.350 కోట్లతో రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం

- మొత్తం ఐదు రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయం

- తూర్పు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు మేలు

విజయవాడ నగరాభివృద్ధికి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పెద్దన్నలా నేనున్నానంటోంది. రూ.500 కోట్ల వ్యయంతో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సిద్ధమైంది. ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న స్ర్టామ్‌ వాటర్‌(వర్షపు నీటి) డ్రెయిన్ల నిర్మాణానికి చర్యలు తీసుకోనుంది. ఆటోనగర్‌తో ముడిపడిన ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

విజయవాడను పట్టి పీడిస్తున్న వరదనీటి మళ్లింపు కాలువలకు శాశ్వతంగా పరిష్కారం చూపేందుకు సీఆర్‌డీఏ సిద్ధమైంది. విజయవాడ నగరంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి కారణంగా అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు విజయవాడ నగరంలో స్ర్టామ్‌ వాటర్‌(వర్షపు నీటి) డ్రెయిన్ల నిర్మాణానికి రూ.500 కోట్ల నిధులు కేటాయించారు. ఈ పనులు చాలా వరకు పూర్తయినా.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పర్యవేక్షణ లేకపోవటం, వాటిని వదిలేయటంతో అసంపూర్తిగానే ఉన్నాయి. విజయవాడలో చిన్న వర్షం పడినా కూడా నగరంలోని రోడ్లపై నీరు నిలిచే పరిస్థితి ఏర్పడింది. కొండల మీద కురిసిన వర్షం నగరంలోని లోతట్టు ప్రాంతాలను జలమయం చేస్తోంది. నగరమంతటా పటిష్టమైన వరద నీటి మళ్లింపు కాలువలు లేకపోవటం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. నగరంలో బ్యాలెన్స్‌ వరద నీటి మళ్లింపు కాలువలను పూర్తి చేయటానికి సుమారు రూ.150 కోట్లు అవసరమవుతాయని కార్పొరేషన్‌ అధికారులు అంచనాలు వేశారు. విజయవాడ నగరానికి సంబంధించి రాష్ట్ర మునిసిపల్‌ మంత్రి నారాయణ ఇటీవల సమీక్ష జరిపిన సందర్భంలో వరద నీటి కాలువల అంశం చర్చకు వచ్చింది. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అనేక దఫాలుగా మంత్రి దృష్టికి తీసుకురావటం జరిగింది. బ్యాలెన్స్‌ వరద నీటి మళ్లింపు కాలువల పనులను సీఆర్‌డీఏ ద్వారా చేయించేందుకు మంత్రి నారాయణ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నగర వ్యాప్తంగా బ్యాలెన్స్‌ స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్లను పూర్తి చేసేందుకు రూ.150 కోట్ల నిధులను సీఆర్‌డీఏ ఖర్చు చేయనుంది. బ్యాలెన్స్‌ స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్స్‌తో పాటు ఆటోనగర్‌ గుంటుతిప్ప డ్రెయిన్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు.

రూ.350 కోట్ల వ్యయంతో ఐదు రోడ్ల విస్తరణ

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఆటోనగర్‌తో ముడిపడిన ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా నాలుగు రోడ్ల విస్తరణ పనులు కూడా సీఆర్‌డీఏ చేపట్టబోతోంది. దీని కోసం రూ.350 కోట్ల నిధులను ఖర్చు పెట్టనుంది. ఇప్పటికే విజయవాడ శివారున ఎనికేపాడులో శక్తి కల్యాణ మండపం రోడ్డును సీఆర్‌డీఏ తన సొంత నిధులతో అభివృద్ధి చేసింది. ఇదే క్రమంలో మరో నాలుగు రోడ్లను సీఆర్‌డీఏ అభివృద్ధి చేయనుంది.

- మహానాడు రోడ్డును మరింత విస్తరించాలని నిర్ణయించారు. మహానాడు రోడ్డు మీదుగా విజయవాడలోకి భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ భారీ వాహనాల రాకపోకలను నియంత్రించటం కోసం మహానాడు రోడ్డును నిడమానూరు వరకు పొడిగించి అక్కడ జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ - 16కు అనుసంధానించనున్నారు.

- బల్లెం వారి వీధి కొన్ని చోట్ల 40, 50 అడుగులుగా ఉంది. దీనిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించనున్నారు. అలాగే ఈ రోడ్డును ఎనికేపాడు వరకు విస్తరించి ఎన్‌హెచ్‌ - 16 కు అనుసంధానం చేస్తారు.

- బల్లెం వారి వీధిని శక్తి కల్యాణ మండపం రోడ్డుకు అనుసంధానిస్తారు. దీని వల్ల బల్లెం వారి వీధి మీదుగా వచ్చే వాహనాలు రామవరప్పాడు రింగ్‌ దగ్గర కాకుండా ఎనికేపాడు దగ్గర ఎన్‌హెచ్‌ - 16కు శక్తి కల్యాణ మండం రోడ్డు నుంచి అనుసంధానమవుతాయి. దీని కోసం ఈ రెండు రోడ్లకు ఎలా కనెక్టివిటీ ఇవ్వాలన్న దానిపై సీఆర్‌డీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

-ప్రస్తుతం ఆయుష్‌ ఆస్పత్రి దగ్గర హైటెన్షన్‌ లైన్ల కింద అభివృద్ధి చేసిన రోడ్డును నిడమానూరు వరకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. హైటెన్షన్‌ తీగల కిందుగా ఈ రోడ్డును కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఈ రోడ్డుకు భారీగా వ్యయం అవుతుందని సీఆర్‌డీఏ అధికారులు అంచనాలు వేస్తున్నారు.

- ఎనికేపాడు - తాడిగడప రోడ్డును నేరుగా నిడమానూరుకు అనుసంధానం చేయాలని కూడా నిర్ణయించారు. ఈ రోడ్డును నిడమానూరుకు అనుసంధానం చేయటం ద్వారా ఎన్‌హెచ్‌ - 16కు కనె క్టివిటీని కల్పిస్తారు.

Updated Date - Apr 10 , 2025 | 12:40 AM