Share News

Minister Lokesh: సింగపూర్‌ పర్యటనకు ఉత్తమ టీచర్లు

ABN , Publish Date - Nov 06 , 2025 | 05:23 AM

అధునాతన విద్యా విధానాలపై అధ్యయనానికి 78మంది ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్‌ పర్యటనకు పంపుతున్నట్లు మంత్రి లోకేశ్‌ వెల్లడించారు.

Minister Lokesh: సింగపూర్‌ పర్యటనకు ఉత్తమ టీచర్లు

  • 27నుంచి వారం రోజుల పాటు పర్యటన

  • అక్కడి విద్యా విధానాలపై అధ్యయనం

  • 26న స్టూడెంట్‌ అసెంబ్లీకి ఏర్పాట్లు చేయాలి: మంత్రి లోకేశ్‌

అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): అధునాతన విద్యా విధానాలపై అధ్యయనానికి 78మంది ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్‌ పర్యటనకు పంపుతున్నట్లు మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో ఆయన విద్యాశాఖపై సమీక్షించారు. ఈ నెల 27 నుంచి డిసెంబరు 2 వరకూ వీరి పర్యటన కొనసాగుతుందని చెప్పారు. అక్కడి పాఠశాలలు, బోధనా పద్ధతులు, తరగతి గది వాతావరణంపై అధ్యయనం చేసి, రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలోనివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ‘స్టూడెంట్‌ అసెంబ్లీ’ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిసెంబరు 5న ‘మెగా పేరెంట్‌- టీచర్స్‌’ సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీపై వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేయాలని, కడప మోడల్‌ స్మార్ట్‌ కిచెన్లు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా భవిత ఆటిజం సపోర్టు సెంటర్ల ఏర్పాటు, మౌలిక సదుపా యాలు, ఫ్యాకల్టీపై దృష్టిపెట్టాలని లోకేశ్‌ ఆదేశించారు. అమరావతిలో సెంట్రల్‌ లైబ్రరీ ఏర్పాటు, పౌర గ్రంథాల యాల బలోపేతం, పాఠశాలల్లో డిజిటల్‌ లైబ్రరీలపై చర్చించారు.


యూనివర్సిటీలకు ఉమ్మడి చట్టం

ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిపాలనకు ఉమ్మడి చట్టం రూపొందించాలని మంత్రి లోకేశ్‌ ఆదేశించారు. కాలేజీల్లో నాలుగేళ్ల పాటు చదివినవారికి ఉద్యోగాలు రావట్లేదని, అమీర్‌పేట్‌లో నాలుగు నెలలు కోచింగ్‌ తీసుకు న్నవారు ఉద్యోగాలు సాధిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉన్నతవిద్య పాఠ్య ప్రణాళికను ప్రక్షాళన చేయాలని సూచించారు. ప్రైవేటు కాలేజీలను కూడా నైపుణ్యం పోర్టల్‌ ్డతో అనుసంధానించాలని ఆదేశించారు. కాలేజీల్లో ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని యూనివర్సిటీల్లో స్టూడెంట్‌ ఫీడ్‌బ్యాక్‌ మెకానిజం ఏర్పాటుచేయాలని చెప్పారు. ఇంటర్‌లో ఉత్తీర్ణత పెంపునకు చర్యలు తీసుకోవాలని ఇంటర్‌ బోర్డు అధికారులను లోకేశ్‌ ఆదేశించారు. అన్ని గ్రూపులకు వారాంతపు పరీక్షలతో పాటు ట్రాకింగ్‌ వ్యవస్థను రూపొందించాలని సూచించారు.


78వేల మందికి ఉద్యోగాలు

కూటమి ప్రభుత్వంలో 406 జాబ్‌ మేళాలు నిర్వహించగా వాటి ద్వారా 78వేల మంది ఉద్యోగాలు సాధించినట్లు లోకేశ్‌ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ఏఐ, డిజిటల్‌ టెక్నాలజీలపై యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. రాష్ట్రస్థాయి న్యాక్‌ సెంటర్‌ను మంగళగిరిలో ఏర్పాటుచేసే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ చదివినవారిలో 94.6శాతం మందికి, ఐటీఐల్లో చదివినవారిలో 98 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని అధికారులు వివరించారు. 16 పారిశ్రామిక క్లస్టర్ల పరిధిలో 16 పెద్ద సంస్థలను గుర్తించి పాలిటెక్నిక్‌, ఐటీఐలతో అనుసంధానించాలని లోకేశ్‌ ఆదేశించారు.


  • బీపీసీఎల్‌కు రికార్డు సమయంలో భూములిచ్చాం

  • త్వరలోనే రిఫైనరీ పనులు ప్రారంభం: మంత్రి లోకేశ్‌

అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): భారత పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) రామాయపట్నం సమీపంలో భారీ పెట్టుబడితో స్థాపించే ఆయిల్‌ రిఫైనరీకి రికార్డు సమయంలో భూములు కేటాయించామని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. దీనికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని బుధవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఏటా 9నుంచి 12మిలియన్‌ టన్నుల ఆయిల్‌ను శుద్ధి చేసే సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును 2029 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద రూ.96,862 కోట్ల భారీ పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్‌కు 6వేల ఎకరాలు కేటాయిస్తూ గత నెల ప్రారంభంలోనే పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Nov 06 , 2025 | 05:24 AM