140 ఎకరాల్లో ఉధృతంగా బెర్రీ బోరర్ తెగులు
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:51 PM
గిరిజన ప్రాంతంతలో 1,844 ఎకరాల్లో కాఫీ బెర్రీ బోరర్ తెగులు లక్షణాలను గుర్తించామని జిల్లా ఉద్యాన శాఖాధికారి కంటా బాలకర్ణ తెలిపారు. 140 ఎకరాల్లో మాత్రమే తెగులు ఉధృతి అధికంగా ఉన్నదని, ఇందులో 85 ఎకరాల్లో నియంత్రణ చర్యలు పూర్తి చేశామన్నారు.
85 ఎకరాల్లో నియంత్రణ చర్యలు పూర్తి
గిరిజన ప్రాంతంలో 1,844 ఎకరాల్లో లక్షణాలు గుర్తింపు
జిల్లా ఉద్యాన శాఖాధికారి కంటా బాలకర్ణ
అరకులోయ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):
గిరిజన ప్రాంతంతలో 1,844 ఎకరాల్లో కాఫీ బెర్రీ బోరర్ తెగులు లక్షణాలను గుర్తించామని జిల్లా ఉద్యాన శాఖాధికారి కంటా బాలకర్ణ తెలిపారు. 140 ఎకరాల్లో మాత్రమే తెగులు ఉధృతి అధికంగా ఉన్నదని, ఇందులో 85 ఎకరాల్లో నియంత్రణ చర్యలు పూర్తి చేశామన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో వ్యాప్తి చెందిన కాఫీ బెర్రీ బోరర్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపడుతున్నదన్నారు. ప్రప్రథంగా చినలబుడు పంచాయతీ పకనకుడి గ్రామంలో కాఫీ బెర్రీ బోరర్ బయట పడిందన్నారు. తెగులు వ్యాప్తిపై ప్రస్తుతం జిల్లా ఉద్యానశాఖ, ఐటీడీఏ ప్రాజెక్టు ఉద్యానశాఖ, కేంద్ర కాఫీ బోర్డు అధికారులు, వెంకటరామన్నగూడెం విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు బృందాలుగా విడిపోయి సర్వే చేస్తున్నారన్నారు. అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో కాఫీ బెర్రీ బోరర్ తెగులు ఉందన్నారు. పకనకుడికి ఆనుకుని వున్న మాలివలస, మలసింగారం, చినలబుడు, తురాయ్‌గూడ, గరడగుడ, పెదలబుడు గ్రామాల్లో 140 ఎకరాల్లో కాఫీ బెర్రీ బోరర్ తెగులు అధికంగా ఉందన్నారు. ఈ ప్రాంతాలను రెడ్ జోన్‌గా పరిగణించినట్టు చెప్పారు. 140 ఎకరాలకు గాను 85 ఎకరాల్లో కాఫీ కాయలను పూర్తిగా సేకరించి వేడి నీళ్లలో ముంచి భూమిలో పాతిపెట్టామన్నారు. మరో 55 ఎకరాల్లో శుక్రవారం నుంచి కాఫీ కాయలను పూర్తిగా సేకరించి చికిత్స చేసి భూమిలో పూడ్చివేస్తామన్నారు. పాక్షికంగా తెగులు లక్షణాలు కలిగిన 1,704 ఎకరాల్లో నియంత్రణ చర్యలు చేపడతామని తెలిపారు. ప్రధానంగా ఈ తోటల్లో బ్రోకా ట్రాప్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ట్రాప్స్ కాఫీ బెర్రీ బోరర్ కీటకాలను ఆకర్షించి చంపేస్తుందన్నారు. ఈ ట్రాప్స్ వలన తెగులు ఉధృతి తెలుస్తుందన్నారు. అలాగే ఈ తోటల్లో జీవశిలింధ్రం బెవేరియా బెస్సియానా పిచికారీ చేస్తామన్నారు. ఈ శిలింధ్రం కీటకాలను నాశనం చేస్తుందన్నారు. ప్రస్తుతం పాడేరు ఏజెన్సీ వ్యాప్తంగా కాఫీ బెర్రీ బోరర్ తెగులు గుర్తింపు సర్వే జరుగుతున్నదన్నారు. ఈ తెగులు లక్షణాలు కనిపిస్తే రైతులు అధికారుల దృష్టికి తీసుకు రావాలని ఆయన కోరారు.