Logistics Tech Company Blackbuck: తొమ్మిదేళ్లుగా గుంతల రోడ్లతో విసుగు
ABN , Publish Date - Sep 18 , 2025 | 03:46 AM
కర్ణాటక ప్రభుత్వానికి బెంగళూరులోని ప్రముఖ లాజిస్టిక్స్ టెక్ కంపెనీ బ్లాక్‌బక్ షాకిచ్చింది. గుంతలమయమైన రహదారులు, ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, అందుకే తమ కంపెనీని బెంగళూరు నుంచి తరలించాలని...
ఇంకో ఐదేళ్లకూ పూడుస్తారన్న నమ్మకం లేదు
అందుకే వేరే చోటకు తరలిపోతున్నాం
సీఈవో రాజేశ్ యవాజీ సంచలన ప్రకటన
విశాఖ రావాలంటూ వెంటనే లోకేశ్ ఆహ్వానం
స్వచ్ఛ నగరాల్లో విశాఖ ఐదో స్థానంలో ఉంది
గుణాత్మక మౌలిక వసతులు కల్పిస్తున్నాం
మహిళలకు సురక్షితమైన నగరం కూడా
బ్లాక్‌బక్‌ను ఇక్కడికి మార్చే అంశాన్ని పరిశీలించాలని ఐటీ మంత్రి లోకేశ్ వినతి
దీంతో కర్ణాటక పారిశ్రామిక వర్గాల్లో కలకలం
సిద్దూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని పారిశ్రామికవేత్తల పిలుపు
గుంతలన్నీ నవంబరులోగా పూడుస్తామని డీకే శివకుమార్ హామీ
బెంగళూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక ప్రభుత్వానికి బెంగళూరులోని ప్రముఖ లాజిస్టిక్స్ టెక్ కంపెనీ బ్లాక్‌బక్ షాకిచ్చింది. గుంతలమయమైన రహదారులు, ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, అందుకే తమ కంపెనీని బెంగళూరు నుంచి తరలించాలని నిర్ణయించామని ఆ సంస్థ సీఈవో రాజేశ్ యవాజీ బుధవారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి లోకేశ్ స్పందించారు. విశాఖకు వచ్చేయాలని ఆహ్వానించారు. ఈ పరిణామం కర్ణాటక ప్రభుత్వ, పారిశ్రామికవర్గాల్లో కలకలం రేపింది. తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలని పారిశ్రామికవేత్తలు సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు సూచించారు. ముఖ్యంగా బెంగళూరు నగరాభివృద్ధి మంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ దీనిపై స్పందించాలని కోరారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు, కాడుబీసినహళ్ళి ప్రాంతంలో రహదారులు నాసిరకంగా, గుంతలమయంగా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డులోని బెళ్లందూరులో తన ఇల్లు, కార్యాలయం ఉన్నాయని.. ఈ ప్రాంతం నుంచి ఎటు వెళ్లాలన్నా కష్టంగా ఉందని.. తమ ఉద్యోగులు కార్యాలయానికి వచ్చేందుకు గంటన్నరకు పైగా పడుతోందని రాజేశ్ తన పోస్టులో ఆవేదన వ్యక్తంచేశారు.
రోడ్డంతా గుంతలు పడ్డాయని, దుమ్ము రేగుతోందని, కనీస నిర్వహణ కూడా లేదన్నారు. తొమ్మిదేళ్లుగా బాధలు పడుతున్నామని.. మరో ఐదేళ్లయినా ఈ సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకం లేదని తెలిపారు. అందుకే కంపెనీని తరలించాయని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే బెంగళూరు నుంచి ఎక్కడకు తరలించేదీ ఆయన తెలుపలేదు. బ్లాక్‌బక్ లాజిస్టిక్స్ టెక్ కంపెనీలో బి-కేపిటల్, అసీల్, గోల్డ్‌మ్యాన్ సాక్స్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. సంస్థలో 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు. రాజేశ్ యవాజీ పోస్టుపై లోకేశ్ తక్షణమే స్పందించారు. ‘హాయ్ రాజేశ్.. మీ కంపెనీని మా విశాఖపట్నానికి తరలించండి. దేశంలోని స్వచ్ఛ నగరాల్లో అది ఐదోస్థానంలో ఉంది. అక్కడ గుణాత్మకమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. మహిళలకు సురక్షితమైన నగరమన్న రేటింగ్ కూడా పొందాం. మీ కంపెనీని ఇక్కడికి మార్చే విషయాన్ని పరిశీలించండి..’ అని కోరారు.
ప్రభుత్వం స్పందించాలి: పారిశ్రామికవేత్తలు
రాజేశ్ పోస్టు.. లోకేశ్ స్పందనపై బెంగళూరులోని ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు మోహన్‌దాస్‌పాయ్, కిరణ్ మజుందార్ షా తీవ్రంగా స్పందించారు. బెంగళూరులో పాలనా వైఫల్యానికి ఇది నిదర్శనమని పాయ్ ‘ఎక్స్’లో ధ్వజమెత్తారు. డీకే శివకుమార్‌కు ట్యాగ్ చేశారు. ‘పరిస్థితి ఏమీ బాగాలేదు. కంపెనీలు బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి తరలిపోవాలని భావిస్తున్నాయి. జోక్యం చేసుకోండి’ అని ఆయనకు విన్నవించారు. ఇది తీవ్రమైన సమస్యని, పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు అవసరమని బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. రాజేశ్ యవాజీ ప్రకటన తమకు బాధ కలిగిస్తోందని గ్రేటర్ బెంగళూరు ఐటీ కంపెనీల సంఘం జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్ గౌడ అన్నారు. పారిశ్రామికవేత్తల పోస్టులపై డీకే శివకుమార్ కూడా ‘ఎక్స్’లో స్పందించారు. నగరంలోని అన్ని గుంతలను నవంబరులోగా పూడుస్తామని.. ఈ మేరకు కాంట్రాక్టర్లకు గడువు విధించామని తెలిపారు.