BEL Exam Leak: భెల్ పరీక్ష పేపర్ లీక్
ABN , Publish Date - Apr 12 , 2025 | 06:02 AM
భెల్ పరీక్ష పేపర్ లీకైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చినముషిడివాడ జియాన్ డిజిటల్ కేంద్రంలో అడ్మిట్ కార్డుల వెనుక 150 ప్రశ్నలకు జవాబులు ముద్రించి మాస్ కాపీయింగ్ జరగటంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు

చినముషిడివాడ జియాన్ డిజిటల్ కేంద్రంలో మాస్ కాపీయింగ్..?
అడ్మిట్ కార్డు వెనుక 150 ప్రశ్నలకూ జవాబులు ముద్రించిన వైనం
ఇద్దరు అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు తిరిగివ్వడంతో అనుమానం
వాటిపై జవాబులు చూసి ఆందోళనకు దిగిన మిగిలిన అభ్యర్థులు
పరీక్ష రద్దు చేయాలని డిమాండ్.. విచారణ చేపడతామన్న పోలీసులు
పెందుర్తి (విశాఖపట్నం), ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) జాతీయ స్థాయిలో శుక్రవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్ష పత్రం లీకైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చినముషిడివాడలోని జియాన్ డిజిటల్ కేంద్రంలో పేపర్ లీకైందని, మాస్ కాపీయింగ్ జరిగిందని ఆరోపిస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమ సెల్‌ఫోన్లలో పరీక్ష ప్రశ్నపత్రం, జవాబులు రాసిన అడ్మిట్ కార్డు వెనుక భాగం ఫొటోలను చూపుతూ నిరసన తెలిపారు. పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భెల్‌లో ట్రైనీ సూపర్‌వైజర్, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా శుక్రవారం ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడ జియాన్ కేంద్రంలో మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష ప్రారంభం కావలసి ఉండగా సుమారు 500 మంది 12.30 గంటలకే అక్కడకు చేరుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అభ్యర్థుల హాల్‌టికెట్స్ (అడ్మిట్ కార్డులు) తనిఖీ చేసి, రిజిస్ట్రేషన్ అనంతరం నిర్వాహకులు వారిని కేంద్రంలోకి అనుమతించారు. 2 గంటలకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో లాగిన్ అయ్యారు. కేంద్రంలోని ఓ ఫ్లోర్‌లో 3 గంటలకు అభ్యర్థుల నుంచి ఇన్విజిలేటర్లు అడ్మిట్ కార్డులు తీసుకున్నారు. అనంతరం ఆ ఫ్లోర్‌లో పరీక్ష రాస్తున్న ఇద్దరు అభ్యర్థులకు ఓ ఇన్విజిలేటర్ అడ్మిట్ కార్డులు తిరిగి ఇచ్చేశారు.
సాధారణంగా అభ్యర్థుల నుంచి అడ్మిట్ కార్డులు తీసేసుకోవాలి. కానీ వారిద్దరికీ వాటిని తిరిగి ఇవ్వడంపై అనుమానం వచ్చి కొంతమంది ఆరా తీశారు. ఆ అడ్మిట్ కార్డులను పరిశీలించగా వెనక వైపున 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలు ప్రింట్ చేసి ఉన్నాయి. దీంతో మాస్ కాపీయింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ అభ్యర్థులు పరీక్ష పూర్తికాకముందే బయటకు వచ్చి, నిరసన తెలిపారు. దీంతో జవాబులు రాసిన అడ్మిట్ కార్డులు తిరిగిచ్చిన ఇద్దరినీ మరో ఫ్లోర్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రం లీకైందంటూ అభ్యర్థులు కేంద్రం ఎదుట నినాదాలు చేశారు. ఆన్సర్ షీట్ ఫొటోలను తమ సెల్‌ఫోన్లలో ప్రదర్శించారు. నిర్వాహకులు డబ్బులు తీసుకుని ప్రశ్నపత్రం లీక్ చేసి, జవాబులు రాసి ఇద్దరు అభ్యర్థులకు ఇవ్వడంపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు చేరుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. కాగా, భెల్ పరీక్ష పరిశీలకుడు వివరాలు సేకరించారని పోలీసులు తెలిపారు.