Spiritual Practice: భిక్షాటనతో భక్తి మార్గం
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:08 AM
భిక్షాటన అనేది చాలా మందికి జీవనోపాధి. మరికొందరికి అవసరాలు తీర్చే మార్గం. కానీ శివరాములు అనే సాధువు మాత్రం దాన్ని ఒక ఆధ్యాత్మిక సాధనంగా...
వచ్చిన సొమ్ముతో ఆలయాలకు సేవ చేస్తున్న సాధువు
ఏ గుడి వద్ద బిచ్చమెత్తితే అక్కడ వసతుల కల్పనకు కృషి
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఆలయంలో క్యూలైన్ ఏర్పాటు
త్రిపురాంతకం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): భిక్షాటన అనేది చాలా మందికి జీవనోపాధి. మరికొందరికి అవసరాలు తీర్చే మార్గం. కానీ శివరాములు అనే సాధువు మాత్రం దాన్ని ఒక ఆధ్యాత్మిక సాధనంగా, సేవా మార్గంగా ఎంచుకున్నారు. తాను ఎక్కడైతే భిక్షాటన చేస్తారో.. వచ్చిన సొమ్మును ఆ ఆలయానికి అవసరమైన వసతుల కల్పన కోసం ఖర్చు చేస్తారు. ‘మనం భూమిపైకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. వెళ్లేటప్పుడు కూడా అలానే వెళ్లాలన్నదే నా కోరిక’ అని చెబుతుంటారు. ఆయనే ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాలాత్రిపురసుందరీదేవి ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్న శివరాములు (రెడ్డియార్). తమిళనాడు నుంచి రెండేళ్ల క్రితం త్రిపురాంతకం వచ్చిన ఆయన స్థానిక బాలాత్రిపురసుందరీదేవి ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్నారు. ఈ రెండేళ్లలో వచ్చిన సొమ్ములో తన అవసరాలు పోనూ రూ.1.20 లక్షలు పోగేసి ఆలయం వద్ద ఇనుప రాడ్‌లతో ఒక క్యూలైన్‌ను ఏర్పాటు చేయించారు. ‘ఆలయం వద్ద భిక్షాటనతో వచ్చిన డబ్బుతో క్యూలైన్ నిర్మాణం చేయించిన దాత రెడ్డియార్’ అని ఆలయ నిర్వాహకులు ఒక బోర్డును ఏర్పాటు చేశారు. రెడ్డియార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించగా.. ‘నాకు ఎలాంటి ప్రచారం అక్కర్లేదు. నేను ఏ గుడి వద్ద భిక్షమెత్తినా వచ్చిన సొమ్మును ఆ గుడి అవసరాలకే వినియోగిస్తా’ అని చెప్పారు. గతంలో తమిళనాడులోని పలు ఆలయాల వద్ద భిక్షాటన చేశానని, ప్రస్తుతం శ్రీ బాలాత్రిపురసుందరీదేవి ఆలయ సమీపంలో ఉన్న నాగులపుట్ట వద్ద ఆర్చి నిర్మాణం చేయాలనే తలంపుతో ఉన్నానని, అందుకోసం భిక్షాటన కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. ఇందుకు రూ.10 లక్షల వరకూ ఖర్చవుతుందని, ఆ మొత్తం పోగు కాగానే ఆర్చిని నిర్మించి.. మరో ఆలయానికి వెళ్తానని చెప్పారు.