రమణీయం.. లక్ష్మమ్మ అవ్వ రథోత్సవం
ABN , Publish Date - May 20 , 2025 | 12:10 AM
మల్లిసంధ్య లేలేత కిరాణాలతో సూర్య భగవానుడు ఆశీర్వదించగా పండితులు వేదమంత్రాలు వల్లిస్తుండగా శుభకర మంగళ వాయిద్యాలతో ఉత్సవమూర్తి మహాయోగి లక్ష్మమ్మ అవ్వను పరిమళపూలతో ప్రత్యేకంగా అలంకరించిన వెండి రథంపై ఆశీనులు గావించారు.
జనసంద్రమైన ఆదోని
దర్శించుకున్న ప్రముఖులు
ఆదోని, మే 19 (ఆంధ్రజ్యోతి): మల్లిసంధ్య లేలేత కిరాణాలతో సూర్య భగవానుడు ఆశీర్వదించగా పండితులు వేదమంత్రాలు వల్లిస్తుండగా శుభకర మంగళ వాయిద్యాలతో ఉత్సవమూర్తి మహాయోగి లక్ష్మమ్మ అవ్వను పరిమళపూలతో ప్రత్యేకంగా అలంకరించిన వెండి రథంపై ఆశీనులు గావించారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అవ్వ రథోత్సవం కన్నులారా తిలకించేందుకు భక్తజనం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుండగా శుభ ముహూర్తం సాయంకాల సంధ్యావేళ 3.00 గంటలకు మహారథం చక్రాలు కదిలాయి. ఒక్కసారిగా జయహో లక్ష్మాంబికాదేవి జయహో జయహో లక్ష్మమ్మ అవ్వ జయహో అంటూ అవ్వనామ స్మరణంతో పురవీధులు భక్తితత్వంతో ప్రతిధ్వనించాయి. ఆధ్యాత్మికత శోభిల్లింది. ఆదోని పట్టణంలో సోమవారం మహాయోగి లక్ష్మమ్మవ్వ జాతర మహోత్సవం, వెండి మహారథోత్సవం కన్నుల పండుగగా సాగింది. బ్రాహ్మణ వీధి నుంచి ప్రారంభమైన అవ్వ రథోత్సవం హవన్నపేట కూడలి, బుడ్డేకల్ సర్కిల్, పూల బజార్, షరాఫ్ బజార్ మీదుగా సాగి యథాస్థానం చేరుకోవడంతో ఉత్సవం ముగిసింది. అడుగడుగునా భక్తులు అవ్వ రథానికి టెంకాయలు సమర్పించి పూజలు చేశారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో పురవీధులు జన సందోహంగా మారాయి. ఎటు చూసినా జాతర కోలాహలమే.
ప్రత్యేక పూజలు
ఆరాధన, జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని మహాయోగి లక్ష్మమ్మ అవ్వ మూల బృందావనానికి కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెచ్చిన పరిమళాలు వెదజల్లే ప్రత్యేక పూలతో అలంకరించారు. ఉదయం ఐదు గంటలకే అవ్వను దర్శించుకుని మోక్ష ప్రాప్తి పొందేందుకు జిల్లా నలుమూలల నుంచి కాకుండా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చారు. పెద్ద ఎత్తున బారులు దీరారు. ఉత్సవాల సందర్భంగా అవ్వకు అభిషేకం, ఆకుల పూజలు, కుంకుమార్చన, బిల్వార్చన, మహా మంగళ హారతి తదితర విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య ఆధ్వర్యంలో ఉత్సవాలు సాగాయి. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అవ్వ ఆలయం చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవిశెట్టి ప్రకాష్, డీఎస్పీ హేమలత అవ్వను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులకు పట్టణంలో ప్రతిచోట అన్నదానంతో పాటు మజ్జిగ, తాగునీటిని ఏర్పాటు చేశారు. ముందుగా లక్ష్మమ్మ అవ్వ పుట్టినిల్లు అయిన ముసానహళ్లి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పల్లకి ద్వారా భజనలతో ఆలయం చేరుకొని పూజలు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని డీఎస్పీ హేమలత ప్రారంభించారు.
నూతన జంటలే అధికం
లక్ష్మమ్మ అవ్వను దర్శించుకునేందుకు కొత్తగా పెళ్లయిన వందలాది జంటలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కలశం చూసిన తర్వాతే ఏ శుభకార్యానికైన వెళ్ళవచ్చనేది నానుడి. కలలశం చూడకుండా ఏ కార్యానికి పాల్గొనడానికి వీలుండదని పెద్దలు చెబుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున తరలివచ్చి కలశం చూసిన అనంతరం అవ్వ సన్నిధిలో పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
పోలీసులు భారీ బందోబస్తు
లక్ష్మమ్మ అవ్వ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా డీఎస్పీ హేమలత పర్యవేక్షణలో సీఐలు శ్రీరామ్, రాజశేఖర్ రెడ్డి, రామలింగమయ్య, ఆస్పరి సీఐ మస్తాన వలి, ఎస్సై, పోలీసులతో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడే బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్ళించారు.