Beach Sand Mining: బీచ్‌శాండ్‌పై కదలిక
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:56 AM
బీచ్‌శాండ్ మైనింగ్‌లో కదలిక మొదలైంది. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో టెండర్లు ఖరారు చేసే పనిలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిమగ్నమైంది. గత జగన్ ప్రభుత్వ హయాంలోనే రెండు ప్రాంతాల్లో...
టెండర్లు ఖరారు చేయనున్న సర్కారు
ముందు వరుసలో అదానీ కంపెనీలు
హైకోర్టు సూచనల మేరకు నిబంధనల్లో మార్పులకు అవకాశం
మరో 16 వేల హెక్టార్లలో లీజులకు కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
బీచ్‌శాండ్ మైనింగ్‌లో కదలిక మొదలైంది. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో టెండర్లు ఖరారు చేసే పనిలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిమగ్నమైంది. గత జగన్ ప్రభుత్వ హయాంలోనే రెండు ప్రాంతాల్లో వెయ్యి హెక్టార్లలో రెండు మైనింగ్ లీజులు చేపట్టేందుకు అవసరమైన డెవలపర్ ఎంపిక కోసం టెండర్లు పిలిచారు. ఇప్పుడు ఆ టెండర్లకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. టెండర్లు ఖరారు చేసుకోవచ్చని హైకోర్టు ఇటీవల అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో నిర్వహించిన టెండర్లలో కంపెనీలు దాఖలు చేసిన ఆర్థిక, సాంకేతిక బిడ్లను అధికారులు పరిశీలించారు. బిడ్డింగ్‌లో అర్హత సాధించిన కంపెనీల వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిసింది. ఇందులో అదానీ గ్రూప్‌నకు చెందిన రెండు కొత్త కంపెనీలు బిడ్‌లు దాఖలు చేసిన విషయాన్ని గతంలోనే ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా గార, విశాఖ జిల్లా భీమిలిలో మైనింగ్‌కు జరిగిన టెండర్లలో అదానీ గ్రూప్ కంపెనీలే ముందువరసలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టు సూచనల మేర కు ప్రాజెక్టు డెవలపర్ విధులు, ఏపీఎండీసీ బాధ్యతల విషయంలో కొన్ని నియమ నిబంధనలు మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు గనుల శాఖ నివేదిక సమర్పించినట్లు తెలిసింది. గతంలో వచ్చిన న్యాయపరమైన చిక్కులు జూలై 31తో తొలగిపోయాయని, ఇక టెండర్ల ఖరారు ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. తొలిదశలో శ్రీకాకుళం జిల్లా గారలో 909.85 హెక్టార్లు, విశాఖ జిల్లా భీమిలిలో 90.15 హెక్టార్లలో విడివిడిగా డెవలపర్ కోసం టెండర్లు పిలిచినట్లు పేర్కొన్నారు.
వాస్తవానికి ఏపీలో ఇంకా 16 వేల హెక్టార్ల పరిధిలో బీచ్‌శాండ్ మినరల్స్ నిక్షేపాలున్నాయని, ఈ మేరకు ఏపీఎండీసీకి లీజులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఆ నివేదికలో తెలిపారు. అయితే కేంద్రం కేవలం వెయ్యి హెక్టార్లకే లీజలు ఇచ్చిందని నివేదించారు. ఈ అంశాలపై గతంలో అణుశక్తి విభాగం లేవనెత్తిన అంశాలు, ఏపీఎండీసీ ఇచ్చిన వివరణలు, ఇతర సాంకేతిక అంశాలను కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే కోర్టు చిక్కులు తొలగినందున తొలుత వెయ్యి హెక్టార్ల పరిధిలో టెండర్లు ఖరారు చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.
కేంద్రానికి ఏపీ సర్కారు లేఖ
16,004 హెక్టార్ల పరిధిలోని 16 లీజులను కూడా ఏపీఎండీసీకి కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మరోసారి కేంద్రానికి లేఖ రాసింది. బీచ్‌శాండ్ మైనింగ్, ఇందులోని ఖనిజాలైన ఇలిమినైట్, రుటైల్, గార్మెట్, సిలిమినైట్, జిక్రాన్, మోనోజైట్‌లను ప్రాసెస్ చేసే ప్లాంట్ల ఏర్పాటు కోసం కనీసం 2 వేల కోట్ల పెట్టుబడులు ఉంటాయని గనుల శాఖ చెబుతోంది. మొత్తంగా విలువ ఆధారిత ప్రాజెక్టులపై కనీసం 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న నిక్షేపాల మేరకు 16 వేల హెక్టార్ల పరిధిలోని మరో 16 లీజులను ఏపీఎండీసీ పేరిట కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఏపీ విన్నపం మేరకు కేంద్రం ఈ 16 లీజులను కూడా ఏపీఎండీసీకి అప్పగిస్తే మరోదఫా ప్రాజెక్టు డెలపర్ల ఎంపిక కోసం భారీ టెండర్లు నిర్వహించాల్సి ఉంటుంది.