Share News

AP Mineral Tenders: బీచ్‌శాండ్‌ అదానీకే

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:35 AM

బీచ్‌శాండ్‌ తవ్వకాల టెండర్లను అదానీ గ్రూప్‌ కంపెనీకి కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లను ఇప్పుడు కూటమి సర్కారు ఖరారు చేసింది.

AP Mineral Tenders: బీచ్‌శాండ్‌ అదానీకే

  • మైనింగ్‌ టెండర్లు ఖరారు చేసిన కూటమి ప్రభుత్వం

  • గత జగన్‌ సర్కారులో అడ్డగోలుగా నిబంధనలు మార్పు

  • అదానీకి లబ్ధి కోసమే కొత్తగా డెవలపర్‌ పాత్ర తెరపైకి

జగన్‌ అలా.. కూటమి ప్రభుత్వం ఇలా!

‘‘వైద్య కళాశాలల ప్రైవేటీకరణ టెండర్లలో పాల్గొనే వారిని హెచ్చరిస్తున్నా.. మేం అధికారంలోకి వచ్చాక కాలేజీలను వెనక్కి తీసుకుంటాం’’ అని వైసీపీ అధినేత జగన్‌ ఓవైపు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మాత్రం జగన్‌ హయాంలో పిలిచిన బీచ్‌శాండ్‌ టెండర్లను ఆ విధానాల ప్రకారమే ఖరారు చేసింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

బీచ్‌శాండ్‌ తవ్వకాల టెండర్లను అదానీ గ్రూప్‌ కంపెనీకి కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లను ఇప్పుడు కూటమి సర్కారు ఖరారు చేసింది. నాడు జగన్‌ కోరుకున్నట్లుగానే రెండు టెండర్లూ అదానీ కంపెనీకే దక్కాయి. ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వానికి చేరింది. విజయవంతమైన బిడ్డర్‌గా అదానీ గ్రూప్‌ కంపెనీని ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇవ్వడమే మిగిలింది. అయితే గతంలో డెవలపర్‌ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు ఆ టెండర్లనే ఖరారు చేయడం ప్రశ్నార్థకంగా మారింది.


ఆది నుంచీ వివాదమే...

గత జగన్‌ ప్రభుత్వంలో చేపట్టిన అత్యంత వివాదాస్పద టెండర్లలో ఇదొకటి. శ్రీకాకుళం జిల్లా గారలో 909.85 హెక్టార్లు, విశాఖ జిల్లా భీమిలిలో 90.15 హెక్టార్లలో బీచ్‌శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌ కోసం ప్రైవేటు డెవలపర్‌ ఎంపిక పేరిట 2024 జనవరిలో జగన్‌ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆ సమయంలో ఏపీఎండీసీ ఎండీ, గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్న వి.జి. వెంకటరెడ్డి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు టెండర్‌ డాక్యుమెంట్‌ (రిక్వెస్టఫర్‌ప్రపోజల్‌-ఆర్‌ఎఫ్‌పీ) తయారుచేశారు. ఈ టెండర్లపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఇది కేంద్ర గనుల చట్టానికి వ్యతిరేకమని విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా టెండర్‌ నిబంధనలు రూపొందించారని, రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారని తీవ్రఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రజాసంఘాలు,పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. హైకోర్టులో కేసు కూడా దాఖలైంది.


తవ్వకాలపై కేంద్రం నిషేధం

బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రైవేటు కంపెనీలు మైనింగ్‌ చేయడానికి వీల్లేదని కేంద్రం 2019 మార్చి 1న నిషేధం విధించింది. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలే తవ్వకాలు చేపట్టాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర అణుఇంధన శక్తి విభాగం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ, ప్రైవేటు సంస్థ కలిసి జాయింట్‌ వెంచర్‌గా మైనింగ్‌ చేస్తే... ఏపీఎండీసీకి 76 శాతం, ప్రైవేటు సంస్థకు 24 శాతం చొప్పున వాటా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, అదానీ కంపెనీకి లబ్ధి చేకూర్చాలన్న పెద్దల సూచనలతో డెవలపర్‌ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంటే, ప్రాజెక్టు పర్యవేక్షణ ఏపీఎండీసీనే చేస్తుందని, డెవలపర్‌గా ప్రైవేటు సంస్థ ఉంటుందని టెండర్‌ నిబంధనల్లో చేర్చారు. ఇందుకుగాను ఏపీఎండీసీకి 8 శాతం, డెవలపర్‌గా వ్యవహరించే ప్రైవేటు కంపెనీకి 92శాతం వాటా వెళ్లేలా నిబంధనలు రూపొందించారు. ఈ నిబంధనపై అప్పట్లో జగన్‌ ప్రభుత్వంలోని న్యాయకమిషన్‌ ముందు అనేకమంది ప్రశ్నలు లేవనెత్తారు. కంపెనీలకు అనుబంధం కూడా అక్కర్లేదని నిబంధన తీసుకురావడాన్ని తప్పుబట్టారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా టెండర్లు జరుపుతున్నారని, వాటిని అడ్డుకోవాలని ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం టెండర్లపై స్టే ఇచ్చింది. ఇది నిబంధనలకు విరుద్ధమని కూటమి ప్రభుత్వం కూడా హైకోర్టు ముందు అంగీకరించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, టెండర్లను కొనసాగిస్తామని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ వేసింది. మరోవైపు నాడు పిటిషన్‌వేసి వ్యక్తి కూడా వెనక్కి తగ్గారు. దీంతో ఏపీఎండీసీ అధికారులు ఇటీవల టెండర్లను ఖరారుచేశారు. అదానీ గ్రూప్‌నకు చెందిన అల్లూవియల్‌ హెవీ మినరల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు టెండర్‌ దక్కించుకుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. డెవలపర్‌ సంస్థ పేరిట అదానీ కంపెనీకి బీచ్‌శాండ్‌ వ్యాపారంలో 92 శాతం వాటా, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే ఏపీఎండీసీకి 8 శాతం వాటా దక్కనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదానీకి జరగాల్సిన మేలు ఆగదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Updated Date - Sep 12 , 2025 | 05:40 AM